ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాజకీయాల నుంచి తప్పుకొన్న వారిలో కాంగ్రెస్ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ కూడా ఒక్కరు. గత రెండేళ్లుగా ఆయన తన వ్యాపారాలను చూసుకొంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మళ్ళీ రాజకీయాలలోకి తిరిగి రావాలనుకొంటున్నట్లు తాజా సమాచారం. ఆయనకు చాలా వ్యాపారాలున్నాయి. కనుక ప్రజల కోసం కాకపోయినా వాటికోసమయినా రాజకీయాలలో ఉండటం చాలా అవసరం. ఈసారి తన సెకండ్ ఇన్నింగ్స్ ని తెదేపా లేదా బీజేపీతో మొదలుపెట్టే అవకాశం ఉంది.
సాధారణంగా ఆయన ఎన్నికల సమయంలో సర్వేలు జరిపించి ఏ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వస్తుందో ఫలితాలు వెల్లడిస్తుంటారు. కనుక తెదేపా, బీజేపీలలో ఏ పార్టీ మళ్ళీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో అంచనా వేసుకొని ఆ పార్టీలో చేరుతారేమో? ఒకవేళ తెదేపాలో చేరితే ఆయన వచ్చే ఎన్నికలలో విజయవాడ నుంచి లోక్ సభకి పోటీ చేయాలనుకొంటారు. కానీ ఆ స్థానాన్ని కేశినేని నానికి కేటాయించారు కనుక ఆయనకు దక్కే అవకాశం లేదు. ఒకవేళ బీజేపీలో చేరినా అదే పరిస్థితి ఎదురవవచ్చును. బీజేపీకి ఆ స్థానాన్ని విడిచిపెట్టేందుకు తెదేపా అంగీకరించదు. కనుక ఆయన ఆ రెండు పార్టీలలో దేనిలో చేరినా వేరే నియోజక వర్గం నుంచి పోటీ చేయడానికో లేదా రాజ్యసభకి వెళ్లేందుకో సిద్దపడాల్సి ఉంటుంది. ఇంతకీ ఆయన తను రాజకీయాలలోకి తిరిగి వస్తున్నట్లు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ముందు ఆ విషయం ఖరారు అయితే అప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయం కూడా ఆయనే ప్రకటించవచ్చును.