సీఎం జగన్ సమీప బంధువు, వైఎస్సార్ జిల్లా చక్రాయపేట వైఎస్సార్సీపీ నేత వైఎస్ కొండారెడ్డిపై నమోదైన కేసును లక్కిరెడ్డి పల్లి కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ కేసుకి సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేవని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసు కొన్నాళ్ల కిందట ఏపీలో సంచలనం అయింది. నేరుగా ఢిల్లీలో బీజేపీ పెద్దల జోక్యంతోనే కేసు నమోదయింది. అయినా పోలీసులు ఆధారాలు మాత్రం చూపించలేకపోయారు.
వైసీపీ తరపున చక్రాయపేట మండలం ఇంచార్జ్ ఉన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేస్తున్న ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ను కమిషన్ల కోసం బెదిరించారు. చక్రాయపేట మండలంలో పనులు చేయాలంటే తప్పకుండా తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని గుత్తేదారును బెదిరించినట్లు విచారణలో తేలడంతో గత 2022 మే 9న కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రాయచోటి జైలుకు తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బెయిలుపై విడుదలయ్యారు.
ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతకు సంబంధించింది. కొండారెడ్డి బెదిరింపులపై ఆయన నేరుగా ఆయన బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. చివరికి కేసు నమోదు చేయక తప్పలేదు. అయితే పోలీసులు మాత్రం ఆధారాలు చూపించడంలో ఫెయిలయ్యారు. కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.