తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తు… ఉంటుందో లేదో తెలీదుగానీ ఉండే అవశాకాలపై తీవ్రంగా జరుగుతున్న సంగతి తెలిసిందే! వాస్తవానికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అలాంటి సంకేతాలేవీ లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ తో పొత్తు అంశమే ఫోకస్డ్ గా పార్టీ నేతలతో చర్చించిందీ లేదు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు అంశమై తెలంగాణ నేతల మధ్య కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ లు ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, ఈ ఇద్దరి మధ్యా టీడీపీతో పొత్తు అంశం చర్చకు వచ్చిందని సమాచారం!
తెలుగుదేశంతో కాంగ్రెస్ పొత్తుకు వెళ్లడం వల్ల నష్టపోయేది కాంగ్రెస్సే అనే విషయాన్ని గుర్తించాలని ఉత్తమ్ కు లక్ష్మణ్ సూచించారు. ఆ పార్టీతో పొత్తు వల్ల ఎలాంటి లాభమూ ఉండదని ఆయన చెప్పారు. దీనిపై ఉత్తమ్ స్పందిస్తూ… వచ్చే ఎన్నికల్లో తెరాసను ఓడించాలంటే అన్ని పార్టీలు కలిసి రావాలని అభిప్రాయపడ్డారు! అంటే, ఆయన టీడీపీతో పొత్తు తమకు లాభమా నష్టమా అనే అంశంపై కాకుండా… తెరాసను ఓడించాలంటే అందరూ కలిసి రావాలన్నారు. ‘భాజపాతో సహా’ అనే అర్థం కూడా ఉత్తమ్ మాటల్లో ఉంది! దానికి లక్ష్మణ్ నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం.
నిజానికి, తెలంగాణలోగానీ, ఆంధ్రాలోగానీ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు అనేది రాజకీయ కోణంలోనే ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తెలంగాణలో తెరాసను ఎదుర్కోవాలంటే.. ఆ రాష్ట్రంలో ఇతర పార్టీలను కలుపుకుని ముందుకు సాగాల్సిన అవసరం కాంగ్రెస్ కి ఉంది. ఈ క్రమంలో టీడీపీ కలిసి వస్తుందా లేదా అనేదానిపై ఎలాంటి అధికారిక నిర్ణయమూ జరగలేదు. ఇక, ఆంధ్రా విషయానికొస్తే… మరోసారి కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినా ఏపీకి న్యాయం జరగదు అనేది దాదాపు స్పష్టమైపోయింది. కాబట్టి, ఆంధ్రాకు న్యాయం జరగాలంటే కేంద్రంలో కనిపిస్తున్న ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో కాంగ్రెస్ పై కొంత సానుకూల చర్చ మొదలైందే తప్ప… టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనో, టీడీపీ అర్రులు చాచుతోందనే కోణంలో ప్రజలు కూడా ఆలోచించడం లేదు. నిజానికి, టీడీపీతో పొత్తు అంశాన్ని తెలంగాణలోగానీ, ఆంధ్రాలోగానీ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా పరిగణిస్తున్న పరిస్థితీ లేదు. దానికి సాక్ష్యమే లక్ష్మణ్ అభిప్రాయంపై ఉత్తమ్ స్పందన.