మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎంపీ కే కేశవరావు ఓటు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన రాష్ట్ర విభజన సందర్భంలో ఏపీ ఎంపీగా వెళ్లారు. ఆంధ్రా ఎంపీ అయిన కేకేను తెలంగాణ తీసుకొచ్చి, ఓటు ఎలా వేయిస్తారంటూ తెరాస మీద భాజపా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తుక్కుగూడలో ఆయన ఓటు వినియోగించుకోవడంతో అక్కడ తెరాస విజయం సాధించింది. ఇది సరైన చర్య కాదంటూ భాజపా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీన్ని ఇక్కడితో వదిలిపెట్టేది లేదనీ, న్యాయపోరాటం చేస్తామని టి. భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా స్పష్టం చేశారు. దాన్లో భాగంగా ముందుగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై ఇవాళ్ల స్పందన కూడా వచ్చింది.
కేకే తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడా, ఆంధ్రాకి చెందినవారా స్పష్టం చేయాలంటూ రాజ్యసభకి లక్ష్మణ్ లేఖ రాశారు. దీనికి సమాధానంగా తమకు లేఖ వచ్చిందనీ… ఏపీ ఎంపీల జాబితాలో నాలుగో వ్యక్తిగా కేశవరావు ఉన్నారంటూ రాజ్యసభ స్పష్టం చేసిందన్నారు లక్ష్మణ్. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల లిస్టులో ఆయన పేరు లేదని స్పష్టం చేశారన్నారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నామనీ, కేసు ఫైల్ చేస్తామని లక్ష్మణ్ చెప్పారు. తెరాస పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.
ఈ అంశంలో భాజపాకే కొంత సానుకూలం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, విభజన సమయంలో కేకే ఆంధ్రాకి చెందినవారిగా ప్రకటించారు, కేవీపీని తెలంగాణకు కేటాయించారు. ఈ ఇద్దరూ తమ సొంత రాష్ట్రాలు… అంటే, కేకే తెలంగాణకు, కేవీపీకి ఆంధ్రాకు ఎంపీ నిధులను ఖర్చుపెట్టుకుంటామని పార్లమెంటుకు లేఖ రాశారు. రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. అయితే, సాంకేతికంగా కేకే ఆంధ్రాకి, కేవీపీ తెలంగాణ నుంచి ఎంపీలుగానే వ్యవహరించాల్సి ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎక్స్ అఫిషియో సభ్యునిగా కేవీపీ ఓటు వినియోగించుకున్నారు. లెక్క ప్రకారం అది సరిపోయింది. కానీ, కేకే ఏపీ కోటాలో ఉన్నారు. తెలంగాణలో తెరాస తరఫున ఓటు వినియోగించుకోవడం వివాదమైంది. దీంతో తెరాస మీద పోరాటానికి భాజపాకి ఒక బలమైన అంశం దొరికినట్టయింది. దీన్ని సద్వినియోగం చేసుకునే బలమైన ప్రయత్నంలోనే లక్ష్మణ్ ఉన్నారని అనిపిస్తోంది.