మున్సిపల్ ఎన్నికలు అయిపోయాయి. దీంతో ఇప్పుడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందా అనే చర్చ మళ్లీ మొదలైనట్టు సమాచారం. నిజానికి, ఈ చర్చ కొన్ని నెలల కిందట బాగా జోరుగానే సాగింది. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ని మరోసారి కొనసాగిస్తారనే అభిప్రాయమూ వ్యక్తమైంది. తన స్థానాన్ని నిలుపుకునేందుకు జాతీయ స్థాయిలో ఆయనా గట్టి ప్రయత్నాలు చేశారనే కథనాలు వినిపించాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తరువాత లక్ష్మణ్ కొనసాగింపు అనుమానమే అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అవి పూర్తికాగానే రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమౌతుందని సమాచారం. ఈ క్రమంలో తెలంగాణలో కూడా మార్పు ఉండొచ్చని భాజపా వర్గాల్లో ఇప్పుడు చర్చనీయం అవుతోంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో లక్ష్మణ్ నాయకత్వాన్ని మార్చాలనే అభిప్రాయం జాతీయ నాయకత్వం ముందుకు రాష్ట్ర నేతలే తీసుకెళ్తున్నట్టు సమాచారం. ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలనే డిమాండ్ మరోసారి తెరమీదికి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ కొత్తవారు ఎవరంటే… కాస్త బలంగా వినిపిస్తున్న పేరు ఎంపీ బండి సంజయ్. ఈయతోపాటు మురళీధర్ రావు, జితేందర్ రెడ్డి, డీకే అరుణ లాంటి కొంతమంది ఆశావహులు కూడా జాబితాలో ఉన్నారు. అయితే, సంఘ్ పెద్దల ఆశీస్సులు సంజయ్ కి ఉన్నాయనీ, ఆయన పేరును ఇదివరకే వారు పార్టీకి సూచించినట్టుగా కూడా ఆ మధ్య కథనాలు వినిపించాయి.
అధ్యక్షుడి మార్పు విషయమై లక్ష్మణ్ దగ్గర ప్రశ్నిస్తే… అంతా అధిష్టానం అభీష్టం మేరకే నిర్ణయాలు ఉంటాయంటూ దాటేస్తున్నారు. లక్ష్మణ్ కొనసాగింపు కష్టం అనే చర్చ తెరమీదికి రావడం వెనక మరో కారణం… గడచిన పదిహేనేళ్లలో భాజపా అధ్యక్షుడిగా ఉంటూ వచ్చినవారంతా హైదరాబాద్ కి చెందిన నాయకులు మాత్రమే ఉన్నారు. దీంతో, తెలంగాణలో పార్టీ విస్తరణ జరగలేదనే అభిప్రాయం జాతీయ నాయకత్వానికి ఉందని తెలుస్తోంది. ఈసారి హైదరాబాద్ కి చెందని నాయకుడికి బాధ్యతలు ఇస్తే పరిస్థితి మారొచ్చు అనేది వారి నిర్ణయంగా ఉంటుందనీ అంటున్నారు.