విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయ పార్టీల నేతలందరూ రాజకీయం చేస్తూంటే సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మాత్రం న్యాయపోరాటం ప్రారంభించారు. ఏపీ హైకోర్టులో ఆయన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇప్పటి వరకు కేంద్రం విశాఖ ఉక్కుపై 5 వేల కోట్లు ఖర్చు చేసిందని.. కానీ 30 వేల కోట్లు టాక్స్ రూపంలో వసూలు చేసిందని లక్ష్మినారాయణ తన పిటిషన్లో పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ను ప్రభుత్వరంగంలో కొనసాగిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి నష్టం లేదని పిటిషన్లో చెప్పుకొచ్చారు. పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
జనసేనకు రాజీనామా చేసిన తర్వాత ఎక్కువగా సామాజిక కార్యక్రమాల మీదే దృష్టి పెట్టిన వీవీ లక్ష్మినారాయణ రాజకీయాల గురించి తక్కువగా మాట్లాడుతున్నారు. అయితే ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పోరాటం జరిగితే స్పందించారు. గతంలో కడప ఉక్కు కోసం సీఎం రమేష్ నిరాహారదీక్ష చేస్తే వెళ్లి సంఘిభావం తెలిపారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉద్యమానికి కూడా మద్దతు తెలిపారు. తాను స్వయంగా న్యాయపోరాటం ప్రారంభించారు. కేంద్రం విధానపరంగా తీసుకునే నిర్ణయాలను కోర్టులో సవాల్ చేయడం సాధ్యం కాకపోవచ్చు కానీ.. ఇలాంటి న్యాయపోరాటం ద్వారా ఓ చర్చను ప్రజల్లో రేపడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
గత ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన తరపున పోటీ చేసిన వీవీ లక్ష్మినారాయణ.. ఓడినప్పటికీ.. విశాఖ ప్రజలకు అందుబాటులోనే ఉంటానన్నారు. విశాఖ కోసం పని చేస్తానని ప్రకటించారు. ఆ ప్రకారం ఇప్పుడు.. స్టీల్ ప్లాంట్ ఉ్దయమంలో యాక్టివ్‌గా భాగస్వాములవుతున్నారు.