భారతీయ జనతా పార్టీతో జనసేన పొత్తును.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ స్వాగతించారు. జనసేన పార్టీ నేతగా తాను తమ పార్టీ అద్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నానని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు విషయంలో.. జనసేనలో ఎవరైనా వ్యతిరేకిస్తారని ఎవరూ అనుకోలేదు కానీ.. స్పందించడానికి ఎవరూ.. జనసేన పార్టీలోని ఇతర నేతలు ముందుకు రాలేదు. పైగా వీవీ లక్ష్మినారాయణ ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కంటే.. సొంత సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. విద్యార్థులు, రైతులకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా.. వెళ్తున్నారు. మంచి మాటలు చెప్పి వస్తున్నారు. కానీ.. జనసేన పార్టీ కార్యక్రమాల్లో మాత్రం కనిపించడం లేదు.
తాను సొంత లక్ష్యాలు పెట్టుకున్నానని.. ఈ ఏడాది వాటి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తానని వీవీ లక్ష్మినారాయణ ప్రకటించారు. పవన్ కల్యాణ్ కూడా.. వీవీ లక్ష్మినారాయణ సేవలను విస్తృతంగా ఉపయోగించుకునే ప్రయత్నం కూడా చేయలేదు.. నాదెండ్ల మనోహర్‌తో కలిసే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. దీంతో.. వీవీ లక్ష్మినారాయణ పార్టీ మారుతున్నారని పలుమార్లు ప్రచారం జరిగింది. కానీ నిర్మోహమాటంగా ఖండించారు కూడా. ప్రభుత్వ నిర్ణయాలపై.. జనసేన తరపున కాకపోయినా.. వ్యక్తిగతంగా అయినా.. వీవీ లక్ష్మీనారాయణ చాలా పాజిటివ్ వేలో సమాధానం చెబుతున్నారు. ప్రభుత్వానికి అధికారం ఉన్నా.. నిబంధనలు పాటించాల్సిందేనన్నారు.
రాజధాని విషయంలో రైతులు కోర్టుకు వెళ్లారని.. కోర్టు న్యాయం చేస్తుందన్నారు. మండలి రద్దు వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వీవీ లక్ష్మినారాయణ.. జనసేన పార్టీలో పెద్దగా కనిపించపోయినప్పటికీ..పెద్దగా ప్రాధాన్యం దక్కకపోయినప్పటికీ.. ఇతర రాజకీయ నేతల్లా.. ఆయన స్వార్థపూరితంగా ఆలోచన చేయడం లేదు. పార్టీకే కట్టుబడి ఉన్నారు. అధ్యక్షుడి నిర్ణయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నారు