లక్ష్మిపార్వతికి జగన్మోహన్ రెడ్డి ఓ పదవి ప్రకటించారు. ఆమెను తెలుగు అకాడమీ చైర్మన్ గా నియమిస్తూ జీవోను జారీ చేశారు. చాలా కాలంగా.. లక్ష్మిపార్వితి జగన్ పార్టీలో ఉంటూ.. ఆయనకు మద్దతుగా మాట్లాడుతూ.. చంద్రబాబును తిడుతున్నా… ఆమెను జగన్ పట్టించుకోలేదని.. వస్తున్న విమర్శలకు.. జీవోతోనే సమాధానం చెప్పారు. తెలుగు అకాడెమీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణంగా తెలుగు అకాడమీకి… లబ్దప్రతిష్టులైన విద్యావేత్తలను నియమిస్తూంటారు. జగన్మోహన్ రెడ్డి.. లక్ష్మిపార్వతిలో ఆ లబ్దిప్రతిష్టులైన విద్యావేత్తను చూశారు. ఉన్నత విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలు, పుస్తకాలు తెలుగు అకాడమీ ద్వారానే ప్రచురితమవుతూ ఉంటాయి.
తొలి దక్షిణాది ప్రధాని అయిన పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు అకాడమి స్థాపించారు. అప్పట్లో ఉన్నత చదువులు కూడా మాతృభాషల్లో ఉండాల్సిన అవసరాన్ని పీవీ గుర్తించి దీన్ని ఏర్పాటు చేశారు. మాతృభాషలో విద్యాబోధనను స్థిరీకరించడానికి ప్రామాణిక గ్రంథాలను తెలుగు ఆకాడమీ అందించింది. ఉన్నత విద్యకు సంబంధించి అన్ని స్థాయిల్లోనూ అంటే ఇంటర్, డిగ్రీ, పి.జి స్థాయిల్లో తెలుగు మీడియంను ప్రవేశపెట్టి, వ్యాప్తిచేసే కృషిలో విశ్వవిద్యాలయాలకు సహకరించడం తెలుగు అకాడమీ ప్రధాన విధి. ఇటీవలి కాలంలో ఇంగ్లీషు మాధ్యమ పుస్తకాలను కూడా ప్రచురిస్తూ తన పరిధిని మరింత విస్తరించుకుంది.
తెలుగు ఆకాడమీ లక్ష్యం.. తెలుగు మీడియంలో ఉన్నత విద్యను వ్యాప్తి చేయడం. కానీ ఏపీ సర్కార్… వచ్చే విద్యా సంవత్సరం నుంచి… ఎనిమిదో తరగతి వరకూ.. మొత్తాన్ని ఇంగ్లిష్ మీడియం చేస్తోంది. ఈ క్రమంలో లక్ష్మిపార్వతిని తెలుగు అకాడమీ చైర్మన్ గా నియమించారు. ఏ ప్రభుత్వం కూడా.. తెలుగు అకాడమీ చైర్మన్ పదవినిఇప్పటి వరకూ.. ప్రభుత్వాలు రాజకీయ పదవిగా చూడలేదు. కానీ జగన్ సర్కార్ మాత్రం అలానే చూసింది.