ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని.. ఎన్టీఆర్కు అర్హతలేదని.. ఆ అర్హత వైఎస్ఆర్కే ఉందన్న జగన్ వ్యాఖ్యలను లక్మిపార్వతి సమర్థించారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు. ఒకరి పేరు తొలగించి, మరొకరి పేరు పెట్టడం వల్ల ఎవరికీ నష్టం జరిగినట్లు కాదని లక్ష్మీ పార్వతి అన్నారు. మానవత్వం ఉన్నవారంతా పేరు మార్చడాన్ని ఆమోదించారని అన్నారు. పేరు మార్పునకు.. మానవత్వానికి సంబంధం ఏమిటో లక్ష్మిపార్వతికే తెలియాలి కానీ.. కనీసం యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ వంటి వారికి ఉన్న పాటి అభిమానం కూడా ఆమెకు లేదనిపించేలా వ్యాఖ్యలు చేశారు.
కుటుంబానికి దూరం కావడం.. పార్టీని కాపాడుకోవడానికి నేతలంతా మూకుమ్మడిగా సొంత బాట పట్టడానికి కారణం ఆమేనని టీడీపీ నేతలు చెబుతూంటారు. జగన్ హయాంలో ఎన్టీఆర్కు జరుగుతున్న అవమానాలను లక్ష్మిపార్వతి సమర్థిస్తున్న తీరు చూస్తే ఎవరికైనా అదే అనుమానం రాక మానదు. బిల్లు ఆమోదించిన వారం పాటు బయటకు రాకుండా ఇప్పుడు వచ్చి.. అందరిపై విమర్శలు చేశారు. పేరు మార్చడాన్ని సమర్తించారు. ఎన్టీఆర్తో తన పెళ్లి చంద్రబాబుకు ఇష్టం లేదని.. చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్తో తన పెళ్లిపై లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారని అందరి సమక్షంలో జరిగిన తమ వివాహం గురించి ఎవరైనా అనుచితంగా వ్యాఖ్యానిస్తే కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చారు.
విచిత్రంగా గతంలో జూనియర్ ఎన్టీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె ఇప్పుడు వెనకేసుకు వస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ పోలికలు జూనియర్లో లేవని.. ఆయన చాలా పొడుగుంటారయితే.. జూనియర్ చాలా పొట్టి అని ఎటకారం చేశారు. ఇప్పుడు అన్నీ కాకపోయినా కొన్ని పోలికలు ఉన్నాయని.. ఆయన రాజకీయాల్లో పనికి రాడని నిరూపించాలనుకుంటున్నారని సమర్థించుకొచ్చారు. లక్ష్మిపార్వతి తీరు టీడీపీ నేతల్ని ఆశ్చర్యపరచ లేదు కానీ.. ఆమె నిజస్వరూపం గురించి ఈ తరానికి తెలిసిందని సంతృప్తి పడుతున్నారు.