పరిశోధన విద్యార్థులకు గైడ్ గా వ్యవహరించాలంటే పీజీ విద్యార్థులకు ఐదేళ్లపాటు బోధించిన అనుభవం ఉండాలి. కానీ , ఈ అర్హత లేకుండానే వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతిని ఏయూ పరిశోధన విద్యార్థులకు గైడ్ గా నియమించడం సంచలనంగా మారింది.
ఎలాంటి అర్హతలు లేకుండానే లక్ష్మీపార్వతిని తెలుగు శాఖ ప్రొఫెసర్ గా నియమించారు ఏయూ అధికారులు. వర్సిటీలో పరిశోధన చేసే విద్యార్థుల్లో కొంతమందికి ఆమెను గైడ్ గా నియమించి కొంతమేర చెల్లింపులు కూడా చేసినట్లుగా సమాచారం. ఈ విషయంపై గతంలోనే నాటి వీసీ ప్రసాదరెడ్డి దృష్టికి పలువురు విద్యార్థులు తీసుకెళ్ళినా ఆయన పట్టించుకోలేదని తెలుస్తోంది.
పూర్తిగా వైసీపీ పెద్దల ఆదేశాలతో పని చేసిన ప్రసాదరెడ్డి నిబంధనలకు విరుద్దంగా లక్ష్మీపార్వతిని గైడ్ గా నియమించారు. ఆమెను పీహెచ్ డీ పర్యవేక్షకురాలిగా నియమించినా సరిగా అందుబాటులో లేకపోవడంపై అప్పట్లోనే వీసీ దృష్టికి తీసుకెళ్లగా..మీరేం టెన్షన్ పడకండి. అన్ని మేము చూసుకుంటామని నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది.
వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేస్తూ పరిశోధనలపై ఇంట్రెస్ట్ చూపే వారి కోసం ఏయూలో టీడీఆర్ హబ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది వైసీపీకి అనుకూలంగా పని చేసే ఉద్యోగులు ప్రమోషన్ పొందేందుకు పీహెచ్ డీలు ప్రదానం చేసేందుకు ఏర్పాటు చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎలాంటి అర్హతలు లేకుండానే లక్ష్మీపార్వతికి ప్రొఫెసర్ హోదాను కట్టబెట్టడంతో ఈ ఆరోపణలకు తాజాగా బలం చేకూరినట్లు అయింది.