`ఎన్టీఆర్` బయోపిక్‌కి పోటీగా `లక్ష్మీస్ ఎన్టీఆర్`ని పట్టాలెక్కించాడు రాంగోపాల్ వర్మ. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన కసరత్తు ఎప్పుడో మొదలెట్టినప్పటికీ – షూటింగ్ విషయంలో ఆలస్యం చేశాడు. `ఈ సినిమా తీయడానికి వీల్లేదు` అంటూ కొంతమంది టీడీపీ పెద్దలు వర్మపై ఒత్తిడి తెచ్చినట్టు వార్తలొచ్చాయి. వాటన్నింటికీ పక్కన పెట్టిన వర్మ… `లక్ష్మీస్ ఎన్టీఆర్`ని దసరా రోజున మొదలెట్టాడు. ఇప్పుడు షూటింగ్ కూడా జరిగిపోతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో `లక్ష్మీస్ ఎన్టీఆర్` షూటింగ్ జరుగుతున్నట్టు టాక్. అత్యంత రహస్యంగా, భారీ బందోబస్తు మధ్య వర్మ షూటింగ్ నిర్వహిస్తున్నాడట. సాధారణంగా తన సహాయకులకు గైడెన్స్ ఇచ్చి.. సెట్‌కి వెళ్లకుండానే పని కానిచ్చేస్తుంటాడు వర్మ. కానీ.. ఈసారి మాత్రం ప్రతీ విషయంలోనూ శ్రద్ద తీసుకుంటున్నాడట. సెట్లో తానే ఉంటున్నాడట. రెండంటే రెండు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు వర్మ. ఎన్టీఆర్ పార్ట్ 1, పార్ట్ 2కి మధ్యలో `లక్ష్మీస్ ఎన్టీఆర్`ని విడుదల చేయాలన్నది
వర్మ వ్యూహం. ఎలాంటి సినిమా తీసినా కొత్తవాళ్లతో సర్దుకుపోయే వర్మ, ఈసారి మాత్రం పేరున్న నటీనటుల్ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. లక్ష్మీ పార్వతి పాత్రలోనూ ఓ ప్రముఖ కథానాయికగా నటిస్తుందట. మరి ఎన్టీఆర్‌గా ఎవరిని సెట్ చేస్తాడో చూడాలి.