భాజపా కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ అర్దాంగి కమలా అద్వానీ బుదవారం సాయంత్రం డిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూసారు. ఈరోజు సాయంత్రం ఆమె ఛాతిలో నొప్పి వస్తున్నట్లు చెప్పగానే వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకొన్న కొద్ది సేపటికే ఆమె మృతి చెందారు. ఆమె వయసు 80 సం.లు. గత ఏడాది డిశంబరు నెలలో కూడా ఒకసారి ఆమె ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించిన తరువాత కోలుకొన్నారు. కానీ అప్పటి నుండి తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అద్వానీ దంపతులకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
అద్వానీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఇద్దరు మంచి మిత్రులనే సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ అప్పుడప్పుడు వారి మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు వస్తుండేవి. అప్పుడు వారు ఎడమొహం, పెడమొహంగా మసులుతున్నప్పుడు కమలా అద్వానీయే చొరవ తీసుకొని వాజ్ పేయిని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించి మళ్ళీ వారి మధ్య రాజీ కుదిర్చేవారు. అలాగే భాజపాలో సామాన్య కార్యకర్తలు ఇంటికి వచ్చినా కూడా ఆమె వారిని ఎంతో ఆదరించి, కన్నతల్లిలాగ అభిమానంగా మాట్లాడేవారు. ఆ కారణంగా, భాజపా నేతలకు, కార్యకర్తలకు ఆమె పట్ల చాలా గౌరవం ఉండేవి. ఆమె మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడితో సహా భాజపా నేతలు, కార్యకర్తలు, ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులో అద్వానీకి కుడిభుజం వంటి ఆమెను కోల్పోవడం తట్టుకోవడం చాలా కష్టమే. కానీ తప్పదు.