బిహార్ లో ప్రభుత్వంలో ఆర్.జె.డి. ప్రధాన భాగస్వామిగా ఉంది. దాని అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి అప్పుడే చురకలు వేయడం మొదలుపెట్టారు. క్రిందటి శనివారం దర్బంగా జిల్లాలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన ఇద్దరు ఇంజనీర్లను సంతోష్ ఝా అనే ఒక గూండా హత్య చేసాడు. ఆ సంఘటనపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందిస్తూ, “ఈ సంఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణిస్తున్నట్లు తెలియజెప్పుతోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ వారు అవసరమనుకొంటే నేరుగా నన్ను సంప్రదించవచ్చును,” అని అన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ఉద్దేశించి చేసినవిగానే ఆ పార్టీ భావించింది. ఎందుకంటే గత పదేళ్లుగా హోం శాఖను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన వద్దే అట్టేబెట్టుకొన్నారు. ఇదివరకు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి బిహార్ రాష్ట్రాన్ని పరిపాలించినపుడు శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో రాష్ట్రంలో హత్యలు, కిడ్నాపులు వంటి అసాంఘీక కార్యక్రమాలు పెరిగిపోయి బిహార్ ఒక ఆటవిక రాజ్యంగా తయారయింది. లాలూని ఎన్నికలలో ఓడించి అధికారం దక్కించుకొన్న తరువాత నితీష్ కుమార్ హోం శాఖను తనవద్దే అట్టేబెట్టుకొని రాష్ట్రంలో అసాంఘీక శక్తులను ఉక్కుపాదంతో అణచివేసి రాష్ట్రంలో మళ్ళీ శాంతిభద్రతల పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలిగారు. ఈసారి ఆర్.జె.డి. ప్రధాన భాగస్వామిగా ఉండటం, లాలూ ఇద్దరు కొడుకులు మంత్రులుగా ఉండటంతో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ వ్యవహారాలలో వేలు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పైన అయన పరిపాలనపైన విమర్శలు చేయడం మొదలుపెట్టడంతో అధికార జెడియు కూడా ఘాటుగానే స్పందించవలసి వచ్చింది.
“నితీష్ కుమార్ కి ప్రజలు మళ్ళీ అధికారం ఎందుకు కట్టబెట్టారో అందరికీ తెలుసు. ఆయన సమర్ధమయిన పాలన చేస్తున్నారు కనుకనే ప్రజలు ఆయనకు మళ్ళీ మళ్ళీ అధికారం కట్టబెడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగయిన విషయం ప్రజలకి కూడా తెలుసు. లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం చాలా సమర్ధంగా వ్యవహరిస్తోంది. ఆ ఇద్దరు ఇంజనీర్లను హత్య చేసిన సంతోష్ ఝా, అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసారు. కనుక లా అండ్ ఆర్డర్ విషయంలో విషయంలో ప్రభుత్వానికి ఎవరి సలహాలు ఇవ్వనసరం లేదు,” అని రాష్ట్ర జెడి(యు) అధ్యక్షుడు వశిష్ట్ నారాయణ్ సింగ్ ఘాటుగా జవాబిచ్చారు.