బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు-తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి యాదవ్ ఇద్దరూ ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. వారిలో పెద్దవాడయిన తేజ్ ప్రతాప్ యాదవ్ వైశాలి జిల్లాలో మహువా అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేస్తుంటే, రెండవ వాడు తేజస్వి యాదవ్ రాఘోపూర్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్నాడు. ఇందులో పెద్ద విచిత్రమేమీ లేదు. కానీ వారిద్దరూ ఎన్నికల అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో పెద్దవాడి వయసు 25 ఏళ్లుగా పేర్కొంటే, చిన్నవాడు 26 ఏళ్ల వయసని పేర్కొనడం విశేషం. అంటే అన్నయ్య కంటే తమ్ముడు పెద్దవాడన్న మాట. అదేదో పొరపాటున జరిగిందని అనుకోవడానికి లేకుండా లాలూ ప్రసాద్, అతని ఇద్దరు కొడుకులు కూడా అఫిడవిట్ లో ఆవిధంగా పేర్కొనడాన్ని గట్టిగా సమర్ధించుకోవడం మరో విచిత్రం. అందుకు వారు చెపుతున్న కారణం ఇంకా విచిత్రంగా ఉంది. ఓటర్ల లిస్టులో తమ వయసులు అదే విధంగా ఉన్నాయి కనుక తప్పనిసరిగా అదేవిధంగా పేర్కొనవలసి వచ్చిందని, అందులో తమ తప్పు ఏమీ లేదని నిర్భయంగా మీడియాకి చెపుతున్నారు. కానీ పెద్దవాడి వయసే ఎక్కువని అందరూ అంగీకరిస్తున్నారు.
ఇదేదో వినడానికి చాలా విచిత్రంగా నవ్వు కలిగించేదిగా ఉన్నప్పటికీ ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించబడతారు. చట్ట ప్రకారం శిక్ష పడవచ్చును కూడా. ఓటర్ల లిస్టులో తమ వయసులు ఆ విధంగా పేర్కొనబడ్డాయి కనుక అఫిడవిట్ లో అదేవిధంగా పేర్కొన్నామని లాలూ, అయన ఇద్దరి కొడుకులు చెప్పడం అతితెలివి ప్రదర్శించడమే.
ఒకవేళ ఓటర్ల లిస్టులో తమ వివరాలు తప్పుగా నమోదు అయ్యి ఉండి ఉంటే వాటిని సవరించుకోవలసిన బాధ్యత వాళ్ళదే తప్ప ఎన్నికల సంఘానిది కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రబ్రీదేవి ఇద్దరూ కూడా ముఖ్యమంత్రులుగా చేసినవారే. వారికి ఇంత చిన్న విషయం తెలియదనుకోలేము. కానీ వారు గుడ్డిగా తమ వాదనను సమర్ధించుకోవడం చూస్తుంటే ప్రజాస్వామ్యం అంటే వారికి ఎంత చులకనో అర్ధం అవుతోంది. తమను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారం వారి మాటల్లో కనిపిస్తోంది. కానీ నామినేషన్ల పరిశీలన తరువాత వారిరువురిని అనర్హులుగా ప్రకటిస్తే అప్పుడు మేల్కొంటారేమో? లాలూ అతని కుమారులు చేసిన ఈ నిర్వాకం బీహార్ ఎన్నికలబరిలో ఉన్న ప్రత్యర్ధ పార్టీలకు మంచి బలమయిన ఆయుధం అందించినట్లయింది. అంతే కాదు యధా రాజా…తధా ప్రజా అన్నట్లుగా యధా లాలూ…తధా కొడుకులు…అని దేశ ప్రజలందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.