నితీష్ కుమార్ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇద్దరు కొడుకులను మంత్రులుగా చేయగలడంతో బిహార్ లో మళ్ళీ లాలూ ‘జంగిల్ రాజ్’ ఆరంభమయినట్లేనని బీజేపీ నేతలు జోకులు వేసుకొంటున్నారు. కేవలం 9వ తరగతి వరకు మాత్రమే చదువుకొన్న లాలూ చిన్న కొడుకు తేజస్వి ప్రసాద్ యాదవ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. దానికి అధనంగా రాష్ట్ర రోడ్ల నిర్మాణ శాఖ, భవనాల నిర్మాణ శాఖలకు కూడా అతనే మంత్రి. అతనిని తన రాజకీయ వారసుడని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు కనుక ఆయనకున్న అన్ని గొప్ప లక్షణాలు అతనిలో కూడా ఉండే ఉంటాయని భావించవచ్చును. లేకుంటే తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నే తన రాజకీయ వారసుడిగా ప్రకటించి అతనికే ఉప ముఖ్యమంత్రి కట్టబెట్టి ఉండేవారు.
అలాగని ఆయన పెద్ద కొడుకుకి ఏమీ అన్యాయం చేయలేదు. అతనికి కూడా నితీష్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మరియు పర్యావరణ శాఖలను కట్టబెట్టారు. లాలూ కొడుకులిద్దరికీ ఎటువంటి రాజకీయ, పరిపాలనా అనుభవం లేదు కనుక ఆయనే స్వయంగా వారిని వెనుక నుండి నడిపించాల్సి ఉంటుంది. కనుక ప్రభుత్వాధికారులు, ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.వంటి ఉన్నతాధికారులు అందరూ లాలూ కొడుకులను కాక లాలూ ప్రసాద్ యాదవ్ నే సంప్రదించడం అనివార్యమన్న మాట! అలాగే నితీష్ కుమార్ ప్రభుత్వంలో 12 మంత్రి పదవులు లాలూ పార్టీ ఎమ్మెల్యేలకే దక్కాయి. కనుక వారందరి సహాయంతో ఇక లాలూ వెనుక సీటులో కూర్చొని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని నడిపించడం మొదలుపెడతారని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ కి, నితీష్ కుమార్ కి ఉన్న తేడా ఒక్కటే. నితీష్ కుమార్ పెట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి కిరీటం అందరికీ కనబడుతుంది. లాలూ ప్రసాద్ యాదవ్ పెట్టుకొన్న కిరీటం కనబడదు అంతే!