కొండకు వెంట్రుక ముడేసి లాగితే కొండ రాదు వెంట్రుకే తెగిపోతుందని అందరికీ తెలుసు అయినా కూడా ఏదో ఆశ. అందుకే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు సాధారణంగా ఏదో ఒక సమస్యని ఎత్తి చూపించి “మేము రాజీనామాకు సిద్దం మీరు రాజీనామాకు సిద్దమేనా?” అంటూ అధికారపార్టీకి సవాళ్లు విసురుతుంటారు. ప్రత్యేక హోదా కోసం వైకాపా నేతలు తెదేపాకి అటువంటి సవాలే విసిరారు. తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల సమస్యలపై ప్రతిపక్షాలు తెరాసకు అటువంటి సవాలే విసిరాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మోడీని డ్డీ కొనలేక చతికిలపడిపోయిన ఆర్.జే.డీ. అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మోడీకి అటువంటి సవాలే విసిరారు. “ఒకవేళ బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయినట్లయితే నరేంద్ర మోడి తన పదవికి రాజీనామా చేస్తారా?” అని సవాల్ విసిరారు. బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకపోవడంతోనే తన ఓటమిని అంగీకరించినట్లయిందని లాలూ ఎద్దేవా చేసారు.
అయితే అటువంటి సవాళ్ళను పట్టించుకొంటే మోడీయే కాదు ఎవరూ అధికారంలో స్థిరంగా ఉండలేరని లాలూ ప్రసాద్ యాదవ్ కి కూడా తెలుసు. ఇదివరకు ఒకసారి లాలూ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు…కానీ అది ప్రతిపక్షాలు సవాలు చేసినందుకు కాదు… జైలుకి వెళ్ళవలసి వచ్చినప్పుడు. అప్పుడు కూడా తన చేతిలో నుండి అధికారం చేజారిపోకుండా జాగ్రత్తపడుతూ తన భార్య రబ్రీదేవిని తన కుర్చీలో కూర్చోబెట్టి మరీ జైలుకి వెళ్ళారు. ఆ తరువాత అక్కడి నుండే ప్రభుత్వాన్ని నడిపించారు కూడా.
అవినీతి కేసులో నాలుగేళ్ళు జైలు శిక్షపడినందున ఎన్నికలలో పోటీ చేసేందుకు, అధికారం చేప్పట్టేందుకు కూడా అర్హత కోల్పోయిన లాలూ ప్రసాద్ యాదవ్ తన పార్టీ తరపున వందమంది అభ్యర్ధులను బరిలో నిలబెట్టి వారి ద్వారా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఒకవేళ తను నిలబెట్టిన అభ్యర్ధులు ఎన్నికలలో ఓడిపోయినా ఆయనకు కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ బీజేపీ ఓడిపోతే మాత్రం నరేంద్ర మోడికి చాలా ఇబ్బందికరమే కానీ అంతమాత్రాన్న ఆయన తన పదవికి రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ కోరడం హాస్యాస్పదమే. బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్ధి పదవికి బీజేపీ దాని మిత్ర పక్షాలలో నలుగురు అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. వారిలో ఎవరి పేరు ప్రకటించినా మిగిలినవారు ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంటుంది కనుకనే బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్ధిపేరును ముందుగా ప్రకటించలేదు. అంతే తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ చెపుతున్నట్లుగా ఓటమిని అంగీకరించి కాదు.