మన రాజకీయాలకి సినీనటులు కొత్త కాదు. చాలామంది రాజకీయాలలోకి వచ్చి రాణించారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్ వంటి వాళ్ళయితే రాజకీయాలని శాసించారు కూడా. రాజకీయాలలో వాళ్ళెప్పుడూ ప్రత్యేక ఆకర్షణగానే నిలుస్తున్నారు. అదేవిధంగా రాజకీయాల నుంచి సినీరంగానికి వెళ్ళినవారు కూడా ఉన్నారు కానీ సినిమాలలో నటించినవారు చాలా తక్కువ. ఆ లోటుని తాను పూడుస్తానని చెపుతున్నారు బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. తను సినిమా స్టార్ కి ఏమాత్రం తీసిపోనని ఎవరైనా తన జీవిత చరిత్రతో సినిమా తీయదలిస్తే థానే స్వయంగా దానిలో నటిస్తానని చెప్పారు. అంతేకాదు తన పక్కన హీరోయిన్ గా ఎవరయితే బాగుంటుందో కూడా లాలూ ప్రసాద్ చెప్పేశారు. తను అమితంగా ఇష్టపడే హేమమాలిని లేదా మాధూరీ దీక్షిత్ అయితే బాగుంటుందని అన్నారు. అయితే తన హీరోయిన్ ఎంపిక విషయంలో కలుగజేసుకొనని, ఆ బాధ్యతా బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ తీసుకొంటే బాగుంటుందని సూచించారు.
నటన విషయంలో లాలూకి ఇటువంటి ఆసక్తి ఉందని, గడ్డి కుంభకోణం కేసులో జైలుకి కూడా వెళ్ళివచ్చిన ఆయన తన జీవిత చరిత్ర సినిమా తీయడానికి అర్హమైనదిగా భావిస్తున్నారని ఎవరూ ఊహించలేకపోయారు. అయితే లాలూ నటనలో సినీ నటులకి ఏమాత్రం తీసిపోకుండా నవ రసాలని చాలా చక్కగా పోషించగలరని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన ప్రసంగాలని, మీడియా స్టేట్మెంట్లని, తప్పులు చేసినప్పుడు తనని తాను చక్కగా సమర్ధించుకొంటూ ఆయన మాట్లాడే మాటలని విన్నట్లయితే ఆయనలో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడని అందరూ అంగీకరిస్తారు.
(జీవిత) కధ రెడీగా ఉంది. హీరో రెడీగా ఉన్నారు. హీరోయిన్ పేరు కూడా ఖరారయిపోయింది. అవసరమైతే హీరో (లాలూ ప్రసాద్ యాదవ్) స్వయంగా తన డైలాగులు వ్రాసుకోగలరు. సరైన దర్శకుడు దొరికితే ఆయనే స్వయంగా పెట్టుబడి పెట్టి సినిమా నిర్మించడానికి సిద్దపడవచ్చు. కనుక ఆయనతో సినిమా చేయడానికి తగిన దర్శకుడని చెప్పదగ్గ రామ్ గోపాల్ వర్మ పూనుకొంటే బాగుంటుందేమో?