హైదరాబాద్: బీహార్లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్లో దీపావళి చేసుకుంటారంటూ అమిత్ షా మొన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలపై జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి, కూటమిపై బీజేపీ – తీవ్రంగా విమర్శించుకుంటూనే ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో విజయంతమకు కీలకం కావటంతో బీజేపీ నాయకత్వం సర్వశక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షా ఈ ఎన్నికలపై గురువారం రక్సౌల్ ఎన్నికల సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై జేడీయూ కూటమి నేతలు విరుచుకుపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలు చిచ్చుపెట్టేవిధంగా ఉన్నాయని, ఓటర్లను మతపరంగా చీల్చటానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. అమిత్ షాకు పిచ్చెక్కిందని, ఆయన 11 కోట్ల బీహారీలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. బీహారీలను ఆయన కడుపులో కొట్టారని అన్నారు. ఆయనకు, ఆయన పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. మతపరంగా ఓట్లు ఆకట్టుకోవటంకోసం అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే బీహార్లో అలాంటి ఎత్తుగడలు చెల్లవని అన్నారు.
అమిత్ షా దీపావళి వ్యాఖ్యలపై జేడీయూ కూటమి నేతలు నిన్న ఎన్నికల సంఘం ఛీఫ్ కమిషనర్ నసీమ్ జైదికి ఫిర్యాదు చేశారు. అమిత్ షా ప్రసంగం చిచ్చుపెట్టే విధంగా ఉందని, మతతత్వాన్ని ప్రేరేపిస్తూ ఆయన బీహార్ ఎన్నికల ప్రక్రియను విషపూరితం చేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసేవరకు అమిత్ షాను బీహార్లో అడుగు పెట్టకుండా నిషేధించాలని కోరారు. అటు బీజేపీ నాయకులు కూడా ఎన్నికల సంఘానికి జేడీయూ నేతలపై ఫిర్యాదు చేశారు. నితీష్, లాలూ, రాహుల్ తదితర నేతలు అమిత్ షాను నరమాంస భక్షకుడని, మోడిని పిశాచమని దూషిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు, జేడీయూ పార్టీ మైనారిటీలను ఆకట్టుకోవటంకోసం తీవ్రవాదంపై మెతకవైఖరి అవలంబిస్తోందని, దళితులు, బీసీల ప్రయోజనాలను పణంగా పెట్టి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానాలు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీ ఇటీవల విడుదల చేసిన 2 ప్రచార ప్రకటనలను ఎన్నికల సంఘం నిషేధించింది. ఆ ప్రకటనలు వివిధ వర్గాల ప్రజలమధ్య విద్వేషాలు రగిల్చేవిధంగా ఉన్నాయని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. బీహార్ నాలుగో దశ ఎన్నికలు రేపు, ఐదో దశ ఎన్నికలు వచ్చే నెల 5వ తేదీన జరగనున్నాయి. ఎన్నికలు ముగిసే సమయం దగ్గరిపడేకొద్దీ నేతల ప్రసంగాలు, భాష దిగజారిపోతున్నాయి.