బీహార్లో లాలు రాజ్యం సాగిన రోజుల్లో పరిస్థితే వేరు. అంతా ఆయన కుటుంబం హవా. ఇప్పుడు మరోసారి చక్రం తిప్పడానికి నితీష్ తో కలిసి తెగ కష్టపడుతున్నారు. లాలు తన ఇద్దరు కొడుకులకూ ఈసారి పార్టీ టికెట్లు ఇచ్చారు. వారిద్దరూ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి సత్తా చాటడానికి సై అంటున్నారు. వారు ఓడిపోతే పరువుపోతుంది కాబట్టి యాదవుల అడ్డా వంటి సురక్షితమైన సీట్లు కేటాయించారు. అక్కడ యాదవ ఓటర్లే ఎక్కువట. తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి పోటీ చేస్తాడు. తేజస్వి యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీపడతాడు.
బీహార్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మహా కూటమి తర్జన భర్జనల తర్వాత ఒకేసారి అన్ని సీట్లకూ అభ్యర్థులను ప్రకటించింది. కులాల వారీ లెక్కలు సమీకరణాలు చూసుకుని టికెట్లు పంచేశారు. 56 శాతం టికెట్లు బీసీలకు దక్కాయి. ముస్లింలకు 14 శాతం వాటా దక్కింది. లాలు పార్టీ యాదవులకు పెద్ద పీట వేసింది. 48 మంది యాదవులు ఆర్జేడీ అభ్యర్థిత్వం దక్కించుకున్నారు.
అయితే మొత్తం మీద మహిళలకు 10 శాతం టికెట్లు మాత్రమే దక్కాయి. యువతకు పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా యువ ఓట్లపై కన్నేసింది. యువతకు ఎక్కువ సీట్లు కేటాయించినట్టు కమలనాథులు ప్రకటించారు. బీజేపీ యువ మంత్రం, మహా కూటమి కుల తంత్రంలో ఏది నెగ్గుతుందో మరి.