ఏ పంటకైనా దిగుబడి తగ్గితే ధర పెరుగుతుంది. దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా వస్తే ధర తగ్గిపోతుంది. అప్పుడెప్పుడో అనంతపురం రైతులు కిలో టమోటా కిలో పది పైసల కంటే తక్కువకు పడిపోవడంతో అమ్మడం ఇష్టంలేక రోడ్లపై పారబోసి, కాళ్ళతో తొక్కి తమ ఆవేదనను వెళ్ళగక్కారు. ఉత్పత్తి ఆధారంగా ధర నిర్ణయం కరెంటుకు ఎందుకు ఆపాదించరు. ఎందుకు అమలు చేయాలని ఆలోచించరు. ఎందుకంటే అక్కడ నష్టపోయేది ప్రభుత్వం కాబట్టి.. ప్రజలు నష్టపోయినా ప్రభుత్వానికి పట్టదు కాబట్టి. రైతు నష్టపోతే అంతకంటే పట్టదు కాబట్టే సర్కారు మొద్దు నిద్ర నటిస్తుంది. అంతర్జాతీయ విఫణిలో చమురు ధరలు పెరిగితే పెట్రోలు, డీజిలు ధరలు పెంచుతారు.. తగ్గితే తగ్గిస్తారు. కరెంటుకు కూడా ఇదే విధానం అమలులోకి తెస్తే బాగుంటుంది కదా. తేరు.. ఎందుకంటే ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు నష్టపోతాయి కాబట్టి ఆ జోలికే వెళ్ళరు.
ఆంధ్ర ప్రదేశ్ విభజన అయిపోయిన తరవాత నవ్యాంధ్రకు కరెంటు కొరతంటే ఏమిటో తెలియకుండా పోయింది. వాడుకున్నవారికి వాడుకున్నంత.. అమ్ముకున్నవాడికి అమ్ముకున్నంతగా కరెంటు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వాన్ని నమ్ముకుని పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్న `తమ`వారు నష్టపోతారు కాబట్టి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సాహసించదు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు పీపీఏలు కుదుర్చుకున్న సంస్థల నుంచి 7 రూపాయలకు యూనిట్ కొని వినియోగదారులకు అందులో సగం ధరకే ఇచ్చింది. ఎందుకంటే తమకు ప్రజల సంక్షేమమే ముఖ్యమంది. నిజమేననుకున్నారు ప్రజలు. ఇక్కడ అసలు సంక్షేమం పీపీఏలు కుదుర్చుకున్న సంస్థలది. ప్రజాధనాన్ని నిలువెల్లా దోచేశారు. ఆ పేరుతో పరిశ్రమలొస్తాయంటూ మభ్యపెట్టారు. ప్రజాప్రతినిధులు విద్యుత్తు ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని విపరీతంగా లబ్ధి పొందారు. ఇందులో పత్రికాధిపతులూ ఉన్నారు. రాజకీయనాయకులది ఇందులో అగ్రతాంబూలం.
రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కొద్దికాలం క్రితం నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. సహజంగానే ఇది రాజకీయ వర్గాలలో సంచలనాన్నీ, కలవరాన్నీరేపింది. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారనీ, విజయవాడ ఎంపీ సీటు ఆయనదేనని ఆ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కున్నాయి. మీడియా సైతం ఇదే నిజమనుకుంది. ఎంతైనా లగడపాటి మాట మీద నిలబడే నాయకుడు. ఓ పత్రికలో ప్రచురితమైన వార్త దీన్ని ధ్రువీకరిస్తోంది. లగడపాటికి చెందిన ల్యాంకో పవర్కూ ప్రభుత్వానికీ నడుమ కుదిరిన పీపీఏను పొడిగించుకునేందుకు ఆయన చంద్రబాబును కలిశారనీ, త్వరలోనే ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదరబోతోందనీ ఆ వార్త పేర్కొంటోంది. ప్రముఖ దిన పత్రికలో వచ్చిన ఆ వార్త విశ్వసనీయత సంగతి ఎలా ఉన్నప్పటికీ, టీడీపీ వర్గాలకు కొంత ఉపశమనాన్ని కలిగించింది. లగడపాటి రాజకీయ రంగ ప్రవేశం చేస్తే.. విజయవాడ ఎంపీ సీటు సహా 7 అసెంబ్లీ నియోజకవర్గాలూ ఆయన చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. అంటే తాజాగా టికెట్లు ఆశించే వారికి ఇబ్బంది.
ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు మళ్ళీ పీపీఏను పొడిగించాల్సిన అవసరమేమిటన్నది తాజా ప్రశ్న. కరెంటు ఉత్పత్తి తగినంత లేకపోతే..ప్రైవేటు కంపెనీలు శరణుజొచ్చాల్సిన అవసరముంటుంది. ఇప్పుడు మిగులు విద్యుత్తు ఉన్నప్పుడు ప్రైవేటు విద్యుత్తును కొనాల్సిన అవసరమేముంది. పోనీ తక్కువ ధరకు ఇస్తారా అంటే అదీ లేదు. ఇటువంటి చర్యలు ప్రజా ప్రయోజనకరమంటే చంటిపిల్లాడు కూడా అంగీకరించడు కాక అంగీకరించడు. పైగా తాజా పీపీఏ పదేళ్ళపాటు ఉంటుందట. పీపీఏలోని క్లాజ్ ప్రకారం ఒప్పందం తీరిపోయాక ఆ ప్లాంటును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. చేసుకోరు. దీనిపై ప్రతిపక్షమూ నోరు మెదపదు. పెద్ద క్యాష్ పార్టీ అయిన లగడపాటి ఏ క్షణంలోనైనా మనసు మార్చుకుని తమ పార్టీలో చేరుతుందేమోనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ. అందుకే తాజా పీపీఏ మీద నిశ్శబ్దాన్ని పాటిస్తోంది ఆ పార్టీ.
దీన్నిబట్టి ఓ విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. రాజకీయాలు ప్రజలపై భారం మోపడానికే తప్ప దించడానికి కాదని.. దీన్ని ఎవరైనా కాదనగలరా?
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి