ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ నలుగురు మంత్రుల పెత్తనం పెరిగిపోయిందని వినబడుతున్న మాటలను మంత్రి నారాయణ ప్రకటన రుజువు చేసినట్లయింది. రెవెన్యూ శాఖ చూడవలసిన భూసేకరణ వ్యవహారంలో కూడా ఆయన వేలుపెట్టడంతో సంబంధిత శాఖా మంత్రి కే.ఈ. కృష్ణమూర్తి తన ఆగ్రహాన్ని మీడియా సమావేశంలో బయటపెట్టారు. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా భూసేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇంటా, బయటా వెల్లువెత్తుతున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన మంత్రి నారాయణ భూసేకరణను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియజేయకుండానే తను భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పించినట్లు చెప్పుకొన్నారు. కానీ ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత కీలకమయిన వ్యవహారంలో తను నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆయనకి తెలియజేయకుండానే భూసేకరణ నోటిఫికేషన్ కూడా విడుదల చేయించినట్లు చెప్పడంతో మంత్రివర్గంలో మిగిలిన మంత్రులనే కాదు ముఖ్యమంత్రిని కూడా ఆయన డామినేట్ చేస్తున్నట్లు దృవీకరించినట్లయింది. ప్రభుత్వంలో అనేకమంది సీనియర్ మంత్రులున్నప్పటికీ ఎవరూ కూడా ఇలాగ ఇతర శాఖల వ్యవహారాలలో వేలుపెట్టరు. ముఖ్యమంత్రి అనుమతి లేకుండా ఇటువంటి సున్నితమయిన వ్యవహారాల మీద మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు. కానీ మంత్రి నారాయణ మాత్రం అన్నీ తానై చక్కబెట్టేస్తున్నారు.
అంతా సవ్యంగా సాగుతున్నంత కాలం ఎవరూ వేలెత్తి చూప(లే)రు. కానీ ఇలాగ అడ్డంగా బుక్ అయిపోయినప్పుడు మాత్రం అందరికీ లోకువే. అయినా మంత్రులు అందరూ ఇంకా పనులుకూడా మొదలుకాని రాజధాని ప్రాంతం చుట్టూ ఉపగ్రహాల్లాగ ఎందుకు తిరుగుతున్నారో తెలియదు. రాష్ట్రంలో రాజధాని నిర్మాణం తప్ప చేయవలసిన పనులు మరేవీ లేవన్నట్లు ఉంది వాళ్ళ వ్యవహారం అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.