విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయిన పెట్టుబడి పెట్టేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించకపోవడంతో, జపాన్ కి చెందిన జైకా సంస్థ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడంతో దాని ఆర్ధిక సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడానికి జైకా సంస్థ ప్రతినిధులు నిన్న విజయవాడకు వచ్చేరు. వారితో కృష్ణా జిల్లా కలెక్టర్, అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు.
మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమయిన అన్ని అనుమతుల కోసం తాము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వచ్చేమని, సాధారణంగా కొన్ని అనుమతులు మంజూరు చేయడానికి ఏడాది కాలం తీసుకొంటుందని, కానీ తమ అభ్యర్ధన మేరకు 9 నెలలోనే అనుమతులు మంజూరు చేయడానికి అంగీకరించినట్లు రాధాకృష్ణ రెడ్డి జైకా ప్రతినిధులకు తెలియజేసారు.
పి.ఎన్.బి.ఎస్.-ఏలూరు రోడ్-నిడమానూరు మధ్య నిర్మించే కారిడార్-2 ప్రాజెక్టుకి టెండర్లు పిలువగా మొత్తం 10 సంస్థలు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. మరో మూడు నెలలోగా టెండర్లను ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే పి.ఎన్.బి.ఎస్- బందరు రోడ్డు- పెనమలూరు సెంటర్ మధ్య నిర్మించే కారిడార్-1 పనులకు కూడా టెండర్లు పిలిచేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే కారిడార్-2కి అవసరమయిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయగలమని జైకా ప్రతినిధులకు రాధాకృష్ణ రెడ్డి హామీ ఇచ్చేరు. ఆ సంస్థ ప్రతినిధులకు ప్రాజెక్టు నిర్మాణం కాబోయే ప్రదేశాలను రాధాకృష్ణ రెడ్డి తదితరులు స్వయంగా చూపించి వారు అడిగిన వివరాలను అన్నటినీ అందజేశారు. 2018లోగా ఈ రెండు కారిడార్ల నిర్మాణం పూర్తి చేయాలనుకొంటున్నామని రాధాకృష్ణ రెడ్డి జైకా సంస్థ ప్రతినిదులకి తెలుపగా వారు తాము కూడా అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.