అమరావతి నిర్మాణానికి ఏపి ప్రభుత్వం 33,000 ఎకరాలు సేకరించింది. తుళ్ళూరు మండలంలో నేలపాడు గ్రామంలో 48 మంది రైతులకి కలిపి 23 ఎకరాల భూమి ఉంది. దానిని వారు ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఇష్టపడక పోవడంతో 2013 భూసేకరణ చట్ట ప్రకారం భూమిని స్వాధీనం చేసుకొనేందుకు వారికి గుంటూరు కలెక్టర్ నిన్న డ్రాఫ్ట్ నోటీసులు జారీ చేశారు. ఆ భూములని అన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది కనుక వాటిపై ఎవరూ ఎటువంటి లావాదేవీలు జరపరాదని నోటీసులలో పేర్కొన్నారు. ఆ నోటీసులపై రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే రెండు నెలలలోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని నోటీసులలో పేర్కొన్నారు.
రాజధాని ప్రాంతంలో రైతులు అందరూ ముందుకు వచ్చి స్వచ్చందంగా తమ భూములని ప్రభుత్వానికి ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా మంత్రులు, నేతలు పదేపదే చెప్పుకొంటుంటారు. కానీ నేలపాడు రైతులకి నోటీసులు ఇవ్వడం గమనిస్తే వారి వాదనలు పూర్తిగా నిజం కాదని అర్ధమవుతుంది. వారి వాదనలలో నిజానిజాలు ఎలాగా ఉన్నప్పటికీ, రాజధాని ప్రాంతంలో అందరి దగ్గర నుంచి భూములు సేకరించిన తరువాత, కొన్ని గ్రామాలని మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదు కనుకనే వారికి నోటీసులు జారీ చేసినట్లు భావించవచ్చు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ల్యాండ్ పూలింగ్ విధానం వలన రైతులకి ఎక్కువ లభి కలుగుతుందా లేకపోతే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎక్కువ లబ్ది కలుగుతుందా? అనే విషయం ఇప్పుడు చర్చకి రావచ్చు. భూసేకరణ చట్టంలో రైతులకి చాలా రక్షణలు కల్పించబడి ఉన్నాయి. దానిలో షరతులన్నీ యధాతధంగా అమలుచేసినట్లయితే నేలపాడు రైతుల భవిష్యత్ కి భరోసాకి డోకా ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ షరతులన్నిటినీ అమలుచేస్తుందా లేదా అనేది కొన్ని ఏళ్ల తరువాత కానీ స్పష్టం కాదు.
దీనివలన మళ్ళీ రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలు, రాజకీయ హడావుడి మొదలవవచ్చు. రైతులకి ఇష్టం లేకుండా వారి నుంచి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేస్తే వారి తరపున తప్పకుండా ప్రభుత్వంతో పోరాడుతానని పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చారు కనుక ఆయన కూడా కలుగజేసుకొనే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా నేలపాడు రైతులకి అండగా నిలబడి ప్రభుత్వంతో పోరాటాలు మొదలుపెట్టవచ్చు. కనుక మళ్ళీ ఇది మరో తాజా సమస్యగా తయారవుతుంది. బహుశః ప్రభుత్వం వీటన్నిటికీ సిద్దపడే నోటీసులు జారీ చేసిందని భావించవలసి ఉంటుంది.