ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భూసేకరణ విషయంలో రైతులకు ఆందోళన తప్పడం లేదు. గ్రామాల్లో 144 సెక్షన్ తప్పడం లేదు. తెలంగాణలో మల్లన్న సాగర్ వ్యవహారం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఏపీలో ఆక్వా ఫుడ్ పార్క్ వ్యవహారం రైతులకు టెన్షన్ పెంచుతోంది.
ఇటు కేసీఆర్ ప్రభుత్వం మల్లన్న సాగర్ విషయంలో రైతుల అభీష్టానికి భిన్నంగా వ్యవహరించడంపై చాలా విమర్శలు వచ్చాయి. బలవంతంగా భూసేకరణ జరపవద్దని హైకోర్టు కూడా హెచ్చరించింది. ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోనెలల తరబడి 144 సెక్షన్ విధించారు. పోలీసులు యూనిఫాంలో, మఫ్టీలో గ్రామాల్లో ప్రజలను భయపెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలనే డిమాండ్ బలంగా ఉంది. విషయం కోర్టు వరకూ వెళ్లింది.
చివరకు, మల్లన్న సాగర్ పరిధిలోని వేములఘాట్ ప్రజలు స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రభుత్వాన్ని ఓ ప్రశ్న అడిగారు. మాకు నిజంగా స్వాతంత్రం ఉందా అని. ప్లకార్డులు ప్రదర్శించారు. మాకెందుకు ఈ శిక్ష అని ఆక్రోశించారు. ఏ స్వేచ్ఛ ఉందని పంద్రాగస్టు వేడుకలను ఏ స్వేచ్ఛ ఉందని జరపాలంటూ సర్పంచ్ కూడా ప్రశ్నించారట. ఊళ్లో ఎటు చూసినా పోలీసులే ఉంటే ఊరంతా క్రిమినల్స్ ఉన్నారేమో అనిపించే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ప్రతిపాదించిన ప్రాంతంలో అదే పరిస్థితి. గ్రామాల్లో 144వ సెక్షన్ అమల్లో ఉంది. గత నెల రోజులుగా ఊళ్లలో 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారనే ప్రశ్నలకు చంద్రబాబు నుంచి జవాబు లేదు.
తమ భూములను లాక్కుని అక్వా ఫుడ్ పార్క్ పెడితే నది కలుషితం అవుతుందని, భూగర్భ జలాలు విషపూరితగా మారిపోతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీని వల్ల తమ బతుకులు దుర్భరంగా మారుతాయనేది అక్కడి ప్రజల ఆవేదన. ఈ సమయంలో ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. సమస్యను పరిష్కరించాలి.
తెలంగాణలోని మెదక్ జిల్లాలో మల్లన్న సాగర్ ముంపు బాధితులు కేసీఆర్ ప్రభుత్వం తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో డిమాండ్ వేరు. అసలు ఆ ఫుడ్ పార్క్ వల్ల నదీ జలాలు కలుషితం అవుతాయంటున్నారు రైతులు. మొత్తానికి రెండు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల్లో రైతులు పోలీసుల భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితులు వచ్చాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలూ రైతుల ఆవేదనను అర్థం చేసుకోలేదనే విమర్శలు వచ్చాయి.