ల్యాండ్ పూలింగ్తో చంద్రబాబు అమరావతి భూముల్ని సేకరించినట్లుగానే.. పేదలకు ఇళ్లు ఇవ్వడానికి భూముల్ని సమీకరించాలని.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉగాది నాటికి పాతిక లక్షల మంది పేదలకు ఇళ్లు ఇస్తామన్న ఆయన .. హామీని నిలబెట్టుకునేందుకు స్థలాల కోసం చూస్తున్నారు. విశాఖలో పేదలకు ఇవ్వడానికి ఎక్కడా ప్రభుత్వ స్థలాలే కనిపించలేదు. గతంలో ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన భూములను ఎకరాల్లో తీసేసుకుని.. గజాల లెక్కల సమీకరణ పేరుతో తిరివ్వాలనే ఆలోచన చేశారు. దాని కోసం ఆదేశాలు కూడా జారీ చేసేశారు.
గత ప్రభుత్వాలు విశాఖలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారికి… సాగు చేసుకోవడానికి కొన్ని వేల ఎకరాలు పంపిణీ చేసింది. వాటిని డి పట్టా భూములు, పీవోటీ భూములు, ఆక్రమణల్లో ఉన్న భూములుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ భూములతో ఆ కుటుంబాలు ఉపాధి పొందుతూ ఉంటాయి. ఇలాంటి భూములు ఆరు వేల ఎకరాలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ ఆరు వేల ఎకరాల్ని స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. అదంతా ప్రభుత్వ భూమే అయినప్పటికీ.. సమీకరణ కింద తీసుకుంటున్నాం కాబట్టి… 250 నుంచి 900 గజాల వరకూ ఇస్తామని చెబుతున్నారు. అంటే.. ఎకరాల్లో పేదల భూములు తీసుకుని వారికి.. ఓ ఇంటి స్థలం మాత్రం ఇస్తారన్నమాట.
ఓ వైపు రాజధానిని ఏర్పాటు చేసేందుకు కనీసం ఐదు వేల ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తూండగా.. ఇళ్ల స్థలాల కోసం.. బడుగులకు ఇచ్చిన స్థలాల్ని సమీకరించడం ఏమిటన్న ప్రశ్న.. అన్ని వర్గాల నుంచి వస్తోంది. రాజధాని కోసం.. ప్రైవేటు భూముల్ని సమీకరిస్తారా.. అన్న చర్చ కూడా నడుస్తోంది. పేదలు ఉపాధి పొందుతున్న భూముల్ని తీసుకుని.. వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం.. ఏం సంక్షేమం అనే చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి విశాఖలో ప్రభుత్వం చేపట్టదలిచిన భూసమీకరణ.. వివాదాస్పదం అయ్యే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.