అటవీ భూములు, ప్రభుత్వ భూములను ఆక్రమించడం.. చుట్టూ గోడో.. ఫెన్సింగో కట్టుకోవడం.. మధ్యలో ఓ విలాసవంతమైన బిల్డింగ్ నిర్మించేసుకుని జల్సాలు చేయడం ఇదీ వైసీపీ నేతల వంతు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, గుడ్మార్నింగ్ స్టార్ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు తాజాగా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంకా ఎంత మంది ఇలా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఎస్టేట్లు కట్టారో అన్నీ బయటకు లాగాల్సి ఉంది.
ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎస్టేట్లో గుర్రప్పందాలు
వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి యాభై ఎకరాల వరకూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి అందులో భారీ భవనం కట్టారు. విలాసాల కోసం దాన్ని నిర్మించారు. చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు. అందులో గుర్రాలను పెంచుతూంటారు. ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. కరోనా సమయంలో రాజకీయ మిత్రులతో అక్కడే గుర్రపుస్వారీలు చేస్తూ హంగామా చేశారు. ఇప్పుడు ఆ లెక్క తేల్చడానికి అధికారులు రెడీ అయ్యారు. ఆ భూములను ఆక్రమించిన వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు.
అడవిని ఆక్రమించుకున్న సజ్జల కుటుంబం
కడప జిల్లాలోనే అటవీ భూముల్ని సజ్జల కుటుంబం చెరబట్టినట్లుగా గుర్తించారు.కనీసం అరవై ఎకరాల వరకూ వారు ఆక్రమించుకున్నట్లుగా నిర్దారించారు. రెండు రోజుల పాటు జరిగిన సర్వేలో అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకోనున్నారు. మరోవైపు ఈ అటవీ భూముల్లోనూ ఓ విలాసవంతమైన ఇల్లు ఉంది.
అడవి మధ్యలో పెద్దిరెడ్డి పుష్ప విలాసం
ఇక పుంగనూరు నియోజకవర్గంలోని మంగళం అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డికిప్రైవేటు భూములు ఉన్నాయట. అడవి మధ్యలో ప్రైవేటు భూముల్ని తాము కొన్నామని చెప్పి.. అక్కడ ఓ పుష్పవిలాసాన్ని నిర్మించారు. ఆ చుట్టూ మిగిలిన అటవీ భూమినికూడా కలిపేసుకున్నారు. ఆయన వ్యవహారంపైనా సర్వే పూర్తయింది. అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
గుడ్నార్నింగ్ స్టార్ కేతిరెడ్డిది వేరే లెవల్
ధర్మవరం ఎమ్మెల్యేగాపని చేసిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిది వేరే లెవల్. ఆయన చెరువును.. భూమిని ఆక్రమించి.. ఓ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ గుడ్మార్నింగ్ స్టార్ నిర్వాకం బట్టబయలు అయింది.
వీరు కొద్ది మందే.. ఇంకా ఎంత మంది ఎన్ని ఎస్టేట్లు కట్టారన్నది.. ఎన్ని వేల ఎకరాలు ఆక్రమించారన్నది అధికారులే లెక్క తేల్చాల్సి ఉంది. ఒక్క సారి అధికారం ఇచ్చిన పాపానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ఇష్టారీతిన రాయించేసుకున్న వీరి తీరు సామాన్యులను సైతం విస్మయానికి గురి చేస్తోంది.