చంద్రబాబునాయుడు రాజధాని అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ అనే విధానం తీసుకు వచ్చే వరకూ.. అందరికీ తెలిసిన ఒకే ఒక్క విధానం.. భూసేకరణ. ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో ప్రజాప్రయోజనాల కోసం అంటూ భూముల్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియ అది. కానీ రాజధాని కోసం పెద్ద ఎత్తున భూములు అవసరం కాబట్టి.. రాజధానితో పాటు భూములు ఇచ్చిన వారు కూడా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. దానిపై ఎవరెన్ని విమర్శలు చేసినా అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల్ని సైతం అబ్బురపరిచింది. ఇప్పుడు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా.. ఆ ల్యాండ్ పూలింంగ్ విధానం అద్భుతమని అనుకుంటున్నాయి. ఆ పద్దతిలోనే ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నాయి.
తెలంగాణ కేబినెట్ భేటీలో ల్యాండ్ పూలింగ్ విధానంపై చర్చ జరిగింది. తెలంగాణలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం, ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రత్యేకంగా లేఅవుట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన విధి విధానాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం.. ఏపీ సర్కార్ కూడా దాదాపుగా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. శివారు ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించి.. లే ఔట్లు వేసి… మధ్య.తరగతి ప్రజలకు తక్కువ కు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రెండు ప్రభుత్వాలు పూలింగ్ కోసం ఉత్సాహపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.
ల్యాండ్ పూలింగ్ పద్దతిలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు.. కొత్త ప్రభుత్వం చేతిలో తంటాలు పడుతున్నారు. ఏ ప్రాజెక్టు కోసం అయితే భూమి ఇచ్చారో ఇప్పుడా ప్రాజెక్ట్ ను ప్రస్తుత ప్రభుత్వం తరలించేస్తోంది. అలాంటప్పుడు ఆ భూమికి విలువ ఎలా వస్తుందో.. వారికి తెలియడం లేదు. అందుకే ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసింది కాబట్టి.. తాము పట్టించుకోబోమని.. తర్వాత వచ్చే ప్రభుత్వాలు అనుకుంటే రైతులే మునిగిపోతారు. దేనికైనా ప్రభుత్వాలపై విశ్వాసమే మొదటి పెట్టుబడి..!