రాజధాని అమరావతికి భూసమీకరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు గతంలో ఎదురైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆనాడు చంద్రబాబు హాయంలో భూములిచ్చి, వారికి ఇవ్వాల్సిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ కేటాయింపు పెండింగ్ ఉన్న వారిని జగన్ సర్కార్ ముప్పు తిప్పలు పెట్టింది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా… ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించలేదు.
కానీ, కొత్త ప్రభుత్వం వచ్చాక సీఆర్డీయేకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటంతో… రిజిస్ట్రేషన్ల ప్రక్రియ స్పీడప్ అయిపోయింది. పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్లు అన్నీ 100రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకోవటంతో పనుల్లో వేగం పెరిగింది.
సీఆర్డీయే పరిధిలోని 29 గ్రామాలకు సరిపడా సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన నేపథ్యంలో… రైతులకు అవగాహన కల్పించాలని, భూములిచ్చిన రైతుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని సీఆర్డీయే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇంకా సేకరించాల్సి ఉన్న భూమి విషయంలో భూ యజమానులతో మాట్లాడటం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వేగం సమాంతరంగా ఉండాలని… అదే సమయంలో రాజధాని ప్రాంతంలో డ్రైనేజీ, పెన్షన్ల పంపిణీ, టిడ్కో ఇండ్ల నిర్మాణాలు వంటి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అంటే… 100రోజుల్లో ఇవన్నీ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, సీఆర్డీయే కూడా వేగం పెంచింది. దీంతో ఇన్ని రోజులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిన వారికి రిలీఫ్ దొరికినట్లే!