ఏపీలో భూముల విలువను హేతుబద్దీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పని చేయాలని అనుకున్నారు. అయితే కసరత్తు పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి ఒకటో తేదీకి వాయిదా వేశారు. ఏపీలో గత ప్రభుత్వ విధానాల వల్ల వివిధ ప్రాంతాల్లో భూముల విలువలు తేడాగా ఉన్నాయి. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ విలువకు, మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ విలువ ఎప్పటికప్పుడు మారుతుంది కానీ రిజిస్ట్రేషన్ విలువ ప్రభుత్వం మారిస్తేనే మారుతుంది.
గతంలో జగన్ ప్రభుత్వం ఆదాయం కోసం మార్కెట్ విలువలతో సమానంగా రిజిస్ట్రేషన్ విలువల్ని ఖరారు చేసారు. అయితే తరవాత ఆ భూములకు విలువ లేకుండా పోయింది. ఫలితంగా రేట్లు తగ్గిపోయాయి. చాలా చోట్ల రిజిస్ట్రేషన్ విలువ కంటే మార్కెట్ రేటు తక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. దీన్ని మార్చాలని ప్రభుత్వం మార్చాలని నిర్ణయించింది. పూర్తి సమాచారం తెప్పించుకున్న ప్రభుత్వం ఈ మేరకు భూముల విలువను మదింపు చేస్తోంది. కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువను తగ్గించడం తో పాటు మరికొన్ని చోట్ల మార్పులు లేకుండా చూడనుంది.
అయితే ప్రభుత్వం మారిన తర్వాత విశాఖ, విజయవాడ, అమరావతితో పాటు చాలా చోట్ల భూముల విలువ పెరిగింది. ఇలాంటి చోట్ల రిజిస్ట్రేషన్ విలువల్ని పెంచనున్నారు. ఇలా డిమాండ్ ఉన్న చోట్ల రిజిస్ట్రేషన్ విలువల్ని.. మార్కెట్ రేటు ఎక్కువగా ఉన్న చోట్ల రిజిస్ట్రేషన్ విలువల్ని పెంచడం ద్వారా.. ఆయా ఓనర్లకు లాభం చేకూరుతుంది. రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి కాస్త భారం పడుతుంది కానీ.. వారి ఆస్తి విలువ రికార్డుల ప్రకారం ఎక్కువగా ఉంటుంది.