” విశాఖ భూసమీకరణలో అవకతవకలు జరిగాయి.. దీనికి ప్రాథమిక ఆధారాలు కూడా ఉన్నాయి..! ” విశాఖ భూసమీకరణ జీవోపై స్టే ఇస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు ఇవి. దీంతో అధికారవర్గాల్లో కలకలం ప్రారంభమయంది. విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడావుడిగా అక్కడ భూసమీకరణ అస్త్రాన్ని ప్రయోగించింది. అయితే.. ఎవరూ స్వచ్చందంగా ఇవ్వరని అనుకున్నారేమో కానీ.. గతంలో ప్రభుత్వాలు పేదలు, బడగు, బలహీనవర్గాలు, మాజీ సైనికుల ఉపాధి కోసం ఇచ్చిన భూముల్ని సమీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి భూసమీకరణ అంటే.. స్వచ్చందంగా ఇచ్చ వారి వద్ద తీసుకోవడం. అభివృద్ధి చేసి భూముల్లో కొంత భాగం వారికి ఇవ్వడం. దీనికి కూడా కొన్ని నియమ నిబంధనలను పాటించాల్సి ఉంది.
అయితే.. విశాఖలో భూసమీకరణ విషయంలో అధికారులు నిబంధనలు అన్నింటికీ నీళ్లొదిలేశారు. ఆరు వేల ఎకరాలకుపైగా సేకరించాలని అనుకున్నారు కానీ.. చాలా తక్కువ మంది రైతులు మాత్రమే అందుకు అంగీకరించారు. అయితే.. అధికారులు మాత్రం భూసమీకరణలో బలాన్ని ప్రయోగించారనే ఆరోపణలు ఉన్నాయి. అవి ప్రభుత్వ భూములేనని ఇవ్వకపోతే.. తాము తీసుకుంటామని బెదిరించారని విపక్షాలు ఆరోపించాయి. అదే సమయంలో.. పెద్ద ఎత్తున ఈ భూసమీకరణ పెద్ద స్కాం అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇళ్ల స్థలాల కోసమే.. ఈ ఆరు వేల ఎకరాల్ని సమీకరిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది కానీ.. అంతకు మించిన లోగుట్టు ఉందన్న అనుమానాలు భూయజమానుల్లో ఏర్పడ్డాయి.
తమ దగ్గర ఉన్న ఆధారాలతో భూయజమానాలు హైకోర్టులో కేసు వేయడంతో.. భూసమీకరణ జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా చేసిన కీలక వ్యాఖ్యలతో.. విచారణ తప్పదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. భూసమీకరణలో.. తీవ్రమైన అవకతవకలకు ప్రాధమిక ఆధారాలున్నాయని స్ఫష్టం కావడంతో.. కొంత మంది అధికారులు ఇరుక్కుపోవడం ఖాయమని చెబుతున్నారు. భూసేకరమ చట్ట నిబంధనలు, ఏపీ మెట్రో పాలిటన్ రీజియన్ , అర్బన్ డెలవప్మెంట్ అధారిటీస్ చట్టాలకు వ్యతిరేకంగా అధికారులు నిర్ణయాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు ఈ భూసమీకరణలో పాలు పంచుకున్న అధికారులకు టెన్షన్ ప్రారంభమనట్లయింది. కొసమెరుపేమిటంటే.. విశాఖ భూసమీకరణలో అవకతవకలు బయటపడితే.. అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం దర్యాప్తు చేయాలని..సీబీఐకి ప్రభుత్వం సిఫార్సు చేయడం.