రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలను విశాఖ స్వామి స్వరూపానంద బాగానే ఉపయోగించుకుంటున్నారు. అత్యంత ఖరీదైన భూములను అతి తక్కువ ధరకే తన ఆశ్రమ అవసరాల కోసం అంటూ కేటాయింప చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు 15 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించింది. మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేసి.. భూములను కేటాయించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ కూడా ప్రతిపాదనలు సమర్పించారు. ధార్మిక సంస్థ సేవగా పరిగణిస్తూ భూమిని కేటాయించాలని దరఖాస్తు చేశారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో చూసుకుని అక్కడే ఇవ్వాలని కోరారు.
భూమి కేటాయించాలని అడిగిన వెంటనే విజయనగరం జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక రెడీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్దకు వెళ్లింది. కేబినెట్ భేటీలో ఆమోదిస్తే ఆ తర్వాత భూమిని శారదాపీఠానికి అప్పగిస్తారు. కొన్నాళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలో స్వరూపానంద స్వామికి ఎకరానికి రూపాయి చొప్పన రెండు ఎకరాలు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమయింది. మత సంస్థలకు ఇలా భూములు కేటాయించడం విరదు్దమని హైకోర్టుోల పిటిషన్లు దాఖలయ్యాయి. ఏదైనా.. ప్రజాప్రయోజనాన్నే ప్రధానంగా చూపిస్తారు. కానీ స్వరూపానంద ఆశ్రమానికి రెండు ప్రభుత్వాలూ గురుదక్షిణగా ఇస్తున్నట్లుగా ఉన్నాయి.
స్వరూపానంద గతంలో అమరావతిలో ఆరు ఎకరాలు కావాలని జగన్ కు పిటిషన్ పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగింది. ఇప్పుడు రాజధానిని విశాఖకు మారుస్తున్నందున అక్కడే పదిహేను ఎకరాలు అడిగినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే స్వరూపానందపై అనేక కబ్జా ఆరోపణలు ఉన్నాయి. తిరుమలలో విశాఖ శారదా పీఠం ఓ మఠం నిర్మించింది. ఆ మఠం నిర్మాణానికి టీటీడీకేటాయించిన స్థలం కన్నా ఎక్కువగా ఆక్రమించి నిర్మించారు. ఇటీవలే క్రమబద్దీకరించారు. విశాఖలో ఉన్న ఆశ్రమంలోనూ ప్రభుత్వ భూములున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.