భారతీయ జనతాపార్టీ నేత లంకా దినకర్‌ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఆయనకు అధికార ప్రతినిధి పదవి ఇవ్వలేదు. అయితే వివిధ టీవీ చానళ్లలో ఆయన బీజేపీ ప్రతినిధిగా పాల్గొంటున్నారు. తనదైన వాయిస్ వినిపిస్తున్నారు. బీజేపీ విధానాలకు విరుద్ధంగా ఆయన టీవీ చర్చల్లో మాట్లాడుతూండటంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. అంతకు ముందు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. పార్టీ తరపున చర్చల్లో పాల్గొనవద్దని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ ఆయన ఆ షోకాజ్‌కు సమాధానం ఇవ్వకుండా.. చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఆయనకు చెప్పినా వినిపించుకోకపోవడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి లంకా దినకర్ తెలుగుదేశం పార్టీ నేత. ఆ పార్టీ తరపున తన అభిప్రాయాలను అధికార ప్రతినిధి హోదాలో వినిపించేవారు. అయితే పార్టీ ఓటమి తర్వాత టీడీపీకి రాజీనామా చేసి.. ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరిపోయారు. కన్నా లక్ష్మినారాయణ నేతృత్వంలో ఈ చేరిక సాగింది. ఆ తర్వాత ఆయనకు బీజేపీ తరపున అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు.
అయితే… బీజేపీ విధానం అయిన… అమరావతే రాజధాని.. కేంద్రానికి సంబంధం లేదు అనే.. టాపిక్‌ను ఆయన… తనదైన శైలిలో వినిపించేవారు. అది బీజేపీ నేతలకు నచ్చలేదు. వైసీపీపై విరుచుకుపడే నేత కావడంతో.. ఆయనపై రకరకాల పుకార్లను ప్రో బీజేపీ నేతలు పుట్టించారు. సోము వీర్రాజు ఏపీ అధ్యక్షుడయిన తర్వాత ఆయనకు అధికార ప్రతినిధి హోదా కూడా లేకుండా పోయింది. అయినప్పటికీ ఆయన చర్చల్లో పాల్గొంటున్నారు. చివరికి సస్పెండ్ చేశారు.