స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి జగన్ను కుటుంబ సమేతంగా కలిశారు. ఈ భేటీలో రాజకీయం ఏమీ లేదని అంతా కుశల ప్రశ్నలకేనని వైసీపీ వర్గాలు ప్రకటించాయి. అయితే.. తమ్మినేని సీతారం వర్గీయులు మాత్రం.. తమ నేత మంత్రి కాబోతున్నారని గట్టి నమ్మకంతో ఉన్నారు. తాను ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటానని.. చివరి సారిగా మంత్రిగా చేయాలని కోరికగా ఉందని… ఆయన సీఎం జగన్కు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం.. మంత్రి పదవిపై ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. ఓ సారి అసెంబ్లీలో అచ్చెన్నతో మాటకు మాట చెబుతూ.. స్పీకర్ హోదాలోనే.. మంత్రిగా వస్తా.. నీ సంగతి చూస్తా అని హెచ్చరించారు.
స్పీకర్గా తమ్మినేని సీతారాం అంత సంతృప్తిగా లేరు. కారణాలు ఏమైనా… సామాజిక సమీకరణాల్లో స్పీకర్గా తమ్మినేని సీతారాంను జగన్ ఖరారు చేశారు. ఆయన అయిష్టతతోనే ఒప్పుకున్నారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరిస్తానని అప్పుడు చాన్స్ ఇస్తామన్న సంకేతాలు రావడంతో ఆయన సైలెంటయిపోయారు. మధ్యలో ఇద్దరు మంత్రులను రాజ్యసభకు పంపడంతో ఖాళీ అయిన స్థానాల్లో చోటు కల్పిస్తారేమోనని ఆశపడ్డారు. కానీ తొలి సారి ఎమ్మెల్యే అయిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు చోటు కల్పించడంతో నిరాశపడ్డారు. ఇప్పుడు అలాంటి చాన్స్ వదులుకోవడానికి తమ్మినేని ఇష్టపడటం లేదు.
తమ్మినేని సీతారం.. ఇరవై ఏళ్ల కిందటే మంత్రిగా పని చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉండేవారు. మంత్రివర్గంలో ఉండేవారు. ఆ తర్వాత ప్రజారాజ్యంపార్టీలోకి వెళ్లడంతో పరిస్థితి మారిపోయింది. అప్పట్నుంచి పదిహేనేళ్ల పాటు ఏ పదవిలోనూ లేరు. గత ఎన్నికల్లో మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవిని నిర్వహించి.. రాజకీయంగా రిటైరవ్వాలని అనుకుంటున్నట్లుగా ఆయనజగన్కు చెబుతున్నారు. అయితే.. ఓ సారి మంత్రి ఇస్తే రిటైర్మెంట్ ఆలోచన ఎగిరిపోతుది. ఒక్క తమ్మనేనికే కాదు.. రాజకీయ నేతలకు నచ్చని పదమే రిటైర్మెంట్. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి.