మొత్తానికి తెలంగాణ ఎన్నికల నామినేషన్ల పర్వం ఈ రోజుతో ముగియనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేయడానికి గడువు ఉంది. డిసెంబర్ 7వ తేదీన జరగనున్న ఎన్నికలకు ఈరోజుతో నామినేషన్ గడువు ముగియనుండటంతో, అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల లాగా హైరానా పడిపోతున్నారు.
ఆఖరి రోజు కావడంతో ఈ రోజు నామినేషన్లు జోరందుకున్నాయి. మహా కూటమి లో నిన్నటిదాకా టికెట్ల పర్వం కొనసాగుతూనే ఉండడం వల్ల, కొంతమంది అభ్యర్థులు పార్టీ టికెట్ వస్తుందేమోనని వేచి చూస్తూ ఉండిపోయారు. అయితే, టికెట్ వచ్చినా రాకపోయినా చాలామంది ఈరోజు పార్టీ తరఫున కానీ స్వతంత్రంగా కానీ నామినేషన్ వేయబోతున్నారు. పైగా ఈ రోజు ముహుర్తం కూడా బాగా ఉన్నందువల్ల అలాంటి సెంటిమెంట్ ఉన్న వాళ్లు కూడా ముందుగానే టికెట్ వచ్చినప్పటికీ ఈరోజు నామినేషన్ వేద్దామని వేచి చూస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడో టికెట్ ప్రకటించినప్పటికీ, ఈటెల రాజేందర్ , కేటీఆర్ లాంటి నాయకులు సైతం ఈరోజు నామినేషన్ వేయనున్నారు. దీంతో మొత్తంగా ఈ రోజు నామినేషన్ల కోలాహలం బాగానే ఉంది. ఇక మరికొంత మంది అభ్యర్థులు పాదయాత్ర చేస్తూనో, లేదంటే ర్యాలీ చేస్తూనో నామినేషన్లకు బయలుదేరుతున్నారు.
మరి కొద్ది గంటలపాటు ఈ సందడి ఇలాగే ఉండనుంది.
ఈరోజుతో నామినేషన్లు వేయడానికి గడువు ముగుస్తుండగా, 20వ తేదీ అంటే రేపు నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 22వ తేదీ. ఆ తర్వాత ఎన్నికలకు కేవలం రెండు వారాలే మిగిలి ఉంటుంది. డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండగా 11న ఫలితాలు వెలువడుతాయి.