నాలుగురోజులుగా కాపు రిజర్వేషన్లకోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం దంపతులు సోమవారం మధ్యాహ్నం సమయానికి దీక్ష విరమిస్తారనే ప్రచారం జరుగుతోంది. విరమింపజేయడానికే తుది విడత చర్చలు జరపడానికి అన్నట్లుగా మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు కిర్లంపూడికి వెళ్లారు.
ప్రధానంగా మూడు డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ముద్రగడ సూచించిన వారికి కాపుకార్పొరేషన్‌లో చోటు కల్పించడం, మంజునాధ కమిషన్ నివేదికను సమర్పించడానికి నిర్దిష్టంగా గడువును నిర్దేశించడం, అలాగే కాపు కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా రుణసదుపాయం కల్పించడం అనేది ఆమోదించిన డిమాండ్లలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే ముద్రగడ దీక్ష విరమణ నాంకేవాస్తేగా సోమవారం మధ్యాహ్నం జరగబోతున్నప్పటికీ వాస్తవానికి ఆదివారం రాత్రే ఈ విషయం ఫైనలైజ్ అయిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. విరమణకు ముద్రగడ ఆదివారం రాత్రే అంగీకరించినట్లుగా చెబుతున్నారు. మంత్రులు వచ్చిన తర్వాత.. ముద్రగడ అడ్డం తిరిగితే ప్రభుత్వం పరువు పోతుంది గనుక… ముందురోజే తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కరరామారావు లు ముద్రగడతో చర్చలు ఫైనలైజ్ చేసి.. ఏయే డిమాండ్లు అంగీకరిస్తున్నారో కూడా తెలియజెప్పేశారని… ఇక దీక్ష విరమణ లాంఛనం అని మాత్రమే చెబుతున్నారు.
అయితే ఇంకా కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. చివరి నిమిషంలో ఊహించిన దానికి భిన్నంగా వ్యవహరించడం ముద్రగడకు అలవాటే అయిన నేపథ్యంలో.. మంత్రులు వెళ్లిన తర్వాత కూడా చివర్లో ఆయన ఏదైనా ట్విస్టు ఇస్తారేమో అనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి.