పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆరవ మరియు చివరి దశ ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఈ దశలో తూర్పు మిడ్నాపూర్, కూచ్ బీహార్ జిల్లాలో గల మొత్తం 25 నియోజక వర్గాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటి కోసం మొత్తం 170 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. రెండు జిల్లాలలో కలిపి మొత్తం 58 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని 16 సీట్లను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. ప్రస్తుతం ఆ పార్టీయే అధికారంలో ఉంది కనుక ఆ నియోజకవర్గాలలో ఆ పార్టీకి మంచి పట్టు ఉందనే భావించవచ్చు. ఈరోజు ఎన్నికలలో ప్రత్యేకత ఏమిటంటే, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూచ్ బీహార్ జిల్లా ప్రజలు ఎన్నికలలో పాల్గొనలేదు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాదే దానిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విలీనం చేసారు. కనుక ఆ జిల్లా ప్రజలు మొట్టమొదటిసారిగా ఎన్నికలలో పాల్గొంటున్నారు.
మూడున్నర దశాబ్దాలుగా కమ్యూనిష్టులు నిర్మించుకొన్న కంచుకోటని గత ఎన్నికలలో మమతా బెనర్జీ బ్రద్దలు కొట్టి వారి నుంచి అధికారం కైవశం చేసుకొన్నారు. కానీ ఈసారి ఎన్నికలలో ఆమెకు వారి నుంచే గట్టి పోటీయే ఎదురవుతోంది. రాష్ట్రంలో మళ్ళీ అధికారం దక్కించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అంటేనే పడని వామపక్షాలు దానితో పొత్తులు పెట్టుకోవడం విచిత్రమే. అలాగే కేరళలో వామపక్షాలతో ఎన్నికల యుద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వారితోనే పొత్తులు పెట్టుకోవడం విచిత్రం. ఒకవేళ ఆ రెండు పార్టీల కూటమి ఈ ఎన్నికలలో విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లయితే అప్పుడు ఆ రెండు పార్టీలు ఒకదానిని మరొకటి ఇదివరకులాగ విమర్శించుకోవడం కష్టమే. అవి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా, విమర్శించుకొంటే ప్రజలు, ప్రత్యర్ధులు నవ్వక మానరు.
ఈ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ కి 60 శాతం విజాయవకాశాలున్నాయని సర్వేలు తెలుపుతున్నాయి. కానీ కాంగ్రెస్, వామపక్షాలు రెండూ కలిసి ఆ అంచనాలను తారుమారు చేయగల సత్తా ఉంది. ఇంకా ఇక్కడ కూడా భాజపా ఒంటరిపోరాటం చేస్తూ ఎదురీదుతోంది. కనుక ఈ ఎన్నికలలో దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు.