విశాఖపట్నంలో వారాహి విజయ యాత్ర మూడవ విడత ప్రారంభమైంది. ఊహించినట్లే ఇసుకవేస్తే రాలనంత జనం సభకి తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇటీవల మరణించిన ప్రజా గాయకుడు గద్దర్ తనతో పలికిన చివరి మాటలను పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే..
విశాఖపట్నం లోని జగదాంబ సెంటర్ వద్ద వారాహి విజయ యాత్ర లో మాట్లాడిన పవన్ కళ్యాణ్, సుస్వాగతం సినిమా సమయంలో ఇదే సెంటర్ వద్ద జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. సుస్వాగతం సినిమా జగదాంబ సెంటర్ వద్ద ఒక బస్సు పైన ఎక్కి డాన్స్ చేసే సన్నివేశాన్ని షూటింగ్ చేశామని, ఆ సమయంలో రోడ్డు మీద అంతమంది ముందు అలా డాన్స్ వేస్తున్నప్పుడు బిడియంతో చచ్చిపోయానని, అప్పుడు తన వదినకు ఫోన్ చేసి ఎందుకని సినిమాల్లోకి పంపించారంటూ కంప్లైంట్ చేస్తున్నట్లుగా మాట్లాడానని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అయితే సరిగ్గా 25 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే జగదాంబ సెంటర్ వద్ద, రాష్ట్రం కోసం కోట్లాదిమంది ప్రజల సమస్యల కోసం, వారి సంక్షేమం కోసం ఇదే సెంటర్ వద్దనుండి మాట్లాడడం సంతోషంగా ఉందని, ఈసారి ఎవరికీ ఈ విషయమై కంప్లైంట్ చేయడం లేదని వ్యాఖ్యానించారు. కాలం తీసుకొచ్చిన మార్పు ఇదని చెప్పుకొచ్చారు.
అయితే ఇటీవలే మరణించిన ఉద్యమకారుడు ప్రజా గాయకుడు అయినటువంటి గద్దర్ తనతో చివరిగా మాట్లాడిన సందర్భంలో కూడా కాలం గొప్పతనం గురించి మాట్లాడారని అన్నారు. గద్దర్ నుండి హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు మెసేజ్ రాగానే హాస్పిటల్ కి వెళ్ళానని, అక్కడికెళ్లి ఆయన ని చూసిన తర్వాత ఆయన ఎంతో కాలం బతకరు అన్న విషయం అర్థమైందని, అయితే అప్పుడు ఆయనతో మాట్లాడిన చివరి మాటలను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. గద్దర్ మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం 60% మంది యువత ఉన్నారని, వారికి సరైన నాయకత్వం వహించే నాయకుడు కావాలని అన్నారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తాను విజయం సాధించాలని ఆయన ఆశిస్తూ మెసేజ్ పెట్టారని పవన్ కళ్యాణ్ అన్నారు. అంతేకాకుండా కాలం అనేది చాలా గొప్పదని, కాలం ముందు ఎవరైనా మోకరిల్లాల్సిందేనని గద్దర్ చివరిగా తనతో మాట్లాడినప్పుడు చెప్పిన మాటలు తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
గద్దర్ తో తన అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ పంచుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది.