Lasya Nanditha accident
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై ఆమె వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో తీవ్ర గాయాల పాలై కారులోనే ప్రాణాలు విడిచారు. డ్రైవర్ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం అతి వేగంతో వెళ్తున్నందున అదుపు తప్పిందని భావిస్తున్నారు. లాస్య నందిత ఇటీవల బీఆర్ఎస్ నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభకు వెళ్లారు. వెళ్లి వస్తున్న సమయంలోనూ ఆమె కారుకు ప్రమాదం అయింది. అయితే అప్పట్లో స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కానీ కొద్ది రోజుల్లోనే మళ్లీ రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు.
లాస్య నందిత ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన యువ ఎమ్మెల్యేల్లో ఒకరు. కంటోన్మెంట్ కు పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న కుమార్తె. అనారోగ్యంతో సాయన్న ఎన్నికల ముందు చనిపోయారు. దీంతో ఆయన కుమార్తెగా లాస్య నందిత ఎన్నికల బరిలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తండ్రి లాగే ప్రజల సమస్యల కోసం పోరాడే లక్షణంతో అందరి ఆదరణ పొందారు. కానీ విధి ఆమెను చిన్న చూపు చూసింది.
లాస్య నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే జి. సాయన్న అడుగుజాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేశారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణలతో మరణించడంతో 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు.