గాయని, భారత రత్న… లతా మంగేష్కర్ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె ఆరోగ్యం సరిగా లేదు. ఇటీవల కరోనా బారీన పడి, కోలుకున్నారు లత. అయితే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఉండడంతో.. ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. శనివారం ఆమె పరిస్థితి బాగా విషమించింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు.
1945లో చిత్రసీమలో గాయనిగా అడుగుపెట్టిన లత.. దాదాపు 20 భాషల్లో 50 వేల పైచిలుకు పాటల్ని పాడారు లత. ఆమె ఖాతాలో కొన్ని తెలుగు పాటలూ ఉన్నాయి. అక్కినేని `సంతానం` చిత్రంలో నిదురపో.. తమ్ముడా.. పాట సూపర్ హిట్. ఆఖరి పోరాటంలో.. `తెల్లచీరకు..` పాట కూడా శ్రోతల్ని అలరించింది. మరాఠీలో `ఆనంద్ ఘన` అనే పేరుతో కొన్ని చిత్రాలకు సంగీతం అందించారు. రెండు చిత్రాల్నీ నిర్మించారు. 2001లో భారత ప్రభుత్వం లతాకు భారతరత్న ఇచ్చి సత్కరించింది.