ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ అంశంపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య కారణాలు, మానసిక ఒత్తిడితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తేల్చారు. గత డిసెంబర్లోనే ఉమామహేశ్వరి చిన్నకుమార్తె వివాహాన్ని వైభవంగా నిర్వహించారు. ఇప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం విషాదం నెలకొంది.
ఎన్టీఆర్ కుటుంబంలో ఎక్కువ మంది పబ్లిక్ లైఫ్‌కి దూరంగా ఉన్నారు. వారిలో ఉమామహేశ్వరి కూడా ఒకరు. చాలా అరుదుగా మాత్రమే ఆవిడ బయట కనిపిస్తూంటారు. కుటుంబ వేడుకల్లోనే ఎక్కువగా కనిపిస్తారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలో సోదరి నారా భువనేశ్వరి గురించి వైసీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా మాట్లాడటంతో … ఖండిచేందుకు మీడియా ముందుకు వచ్చారు. సోదరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు.చంద్రబాబు, దగ్గబాటి కుటుంబాలు చాలా రోజుల తర్వాత కలిసిన సందర్భాలు ఉమామహేశ్వరి కుమార్తె పెళ్లికి సంబంధించిన వేడుకల్లోనే.
ఉమామహేశ్వరి మృతి వార్త తెలిసిన తర్వాత కుటుంబసభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబసభ్యులు వచ్చారు. బాలకృష్ణ కూడా ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎన్టీఆర్ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడం వారి కుటుంబాన్ని విషాదంలో నింపింది.