ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మహారాష్ట్ర కోర్టు నుంచి అరెస్టు వారెంట్ రావడం ఎంతగా సంచలనమౌతోందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ భాజపా వర్గాల్లో చంద్రబాబు నోటీసు అంశంపై కొంత చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ జీవీఎల్ నర్సింహారావు సంగతైతే సరేసరి! ఎవ్వరూ అడక్కుండానే ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఇది భాజపా కక్ష సాధింపు కాదు అని వివరణ ఇచ్చారు. ఇందులో రాజకీయాలు లేవనీ, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందనీ, అయినా చంద్రబాబు ఇలాంటి నోటీసులకు భయపడే రకం కాదని, న్యాయ వ్యవస్థపై బురద చల్లడం సరికాదనీ, ప్రజలే చంద్రబాబుకి బుద్ధి చెబుతారంటూ ఆయన ధోరణిలో ఆయన మాట్లాడేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు… ఇలా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడమంటే భుజాలు తడుముకోవడమే అవుతుంది కదా!
ఇక, భాజపా అధినాయకత్వం విషయానికొస్తే… రాహుల్ గాంధీ కంటే చంద్రబాబు నాయుడుపైనే ముందుగా ఫోకస్ పెట్టాలనే అభిప్రాయం అధినాయక స్థాయిలో వ్యక్తమౌతున్నట్టు తెలుస్తోంది! భాజపాకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ వంటివారు తీవ్రంగా ఆరోపణలూ పోరాటాలూ చేస్తున్నా, ముందుగా ఏదో ఒకలా చంద్రబాబును నిరోధించాలనే చర్చ ప్రస్తుతం కొన్ని వర్గాల్లో జరుగుతున్నట్టు వినిపిస్తోంది. పర్సనల్ డిపాజిట్స్ అకౌంట్లు, పోలవరం ఖర్చులు… ఇలా ఎన్ని వీలైతే అన్ని అంశాలపై ఏదో ఒక రకమైన నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు చేయాలనే చర్చ జరుగుతున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎన్నికలు సమీపించే లోపు ఇలా కొన్ని అంశాల్లో చంద్రబాబు నాయుడుని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలనే వ్యూహ రచన జరుగుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబుపై ఉన్నట్టుండి భాజపాలో ఇంత తీవ్రంగా చర్చకు మరో కారణం… కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు దిశగా జరుగుతున్న ప్రయత్నాలే అనేదీ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి భాజపా కొన్ని ఎంపీ స్థానాలు ఆశిస్తోంది. ఏపీ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఎన్నికల బరిలో దిగితే.. భాజపా ఆశిస్తున్న ఎంపీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉందనేది వారి అంచనాగా తెలుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య కుదురుతున్న పొత్తు… ఆంధ్రాకి మాత్రమే పరిమితం కాదనీ, లోక్ సభ ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే శక్తిగా మారే అవకాశం ఉంటుందనీ, జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన అనుభవం చంద్రబాబుకి ఉందనే విశ్లేషణలూ ఢిల్లీ భాజపా వర్గాల్లో జరుగుతున్నట్టు సమాచారం. అందుకే, ముందుగా చంద్రబాబుపై ఫోకస్ పెట్టాలనే అభిప్రాయం భాజపా అధినాయక స్థాయి నుంచి వ్యక్తమౌతున్నట్టు వినిపిస్తోంది..!