తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరోయ్ అని శ్రీశ్రీ ప్రశ్నించాడు. దానికి ఎవరూ జవాబు చెప్పలేదు గానీ, తాజ్ మహల్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. భార్యపై ప్రేమతో తాజ్ మహల్ కట్టించిన సుల్తాన్ గా షాజహాన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అది ప్రజల సొమ్ముతో కట్టిన సమాధి అని విమర్శించే వాళ్లూ ఉన్నారు. అది వేరే సంగతి. ఇదంతా ఎందుకంటే, ఇక్కడ ఇంకో సుల్తాన్ ముచ్చట చెప్పాల్సి ఉంది.
హిమాచల్ ప్రదేశ్ లో ఓ భర్త తన భార్య కోసం తాజ్ మహల్ కట్టించలేదు గానీ తన స్థాయిలో ఓ ఘనమైన పనే చేశాడు. దీంతో అతడి పేరు ఆ ఊళ్లోనే కాదు, రాష్ట్రమంతటా మార్మోగిపోయింది. హామిర్ పూర్ కు చెందిన శంకర్ ముసాఫిర్ భార్య పేరు గీతాంజలి. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అంటే ఆమెు విపరీతమైన అభిమానం.
సల్మాన్ నటించిన తాజా సినిమా సుల్తాన్ రంజాన్ సందర్భంగా విడుదలైంది. ఈ సినిమాను తన భార్యకు ప్రత్యేకంగా చూపించాలని శంకర్ భావించాడు. అంతే, ఆ ఊళ్లో ఉన్న మినీ థియేటర్ ను బుక్ చేశాడు. అందులోని 120 సీట్లను తానే బుక్ చేసేశాడు. ఇంకెవరూ సినిమా చూడకుండా హౌస్ ఫుల్ బోర్డు పెట్టేశారు థియేటర్ వాళ్లు.
తీరా సినిమా మొదలయ్యే సమయానికి శంకర్, గీతాంజలి ఇద్దరే థియేటర్ వచ్చారు. దర్జాగా లోనికి వెళ్లి కూర్చున్నారు. 120 టికెట్లు కొన్నాడు కాబట్టి థియేటర్ వాళ్లు ఏమీ అనలేక పోయారు. షో మొదలుపెట్టారు. అలా, తన అభిమాన నటుడు సల్మాన్ సినిమాను భర్తతో కలిసి ఏకాంతంగా చూసి సంతోషపడింది గీతాంజలి.
ఈ చర్య వల్ల మిగతా అభిమానులు సినిమా మిస్ అయ్యారు కదా అని కొందరు ప్రశ్నించారు. ఈ ఒక్క షో తోనే సినిమా వెళ్లిపోదు కదా. తర్వాత షో చూడొచ్చు. లేదా కనీసం నెలా రెండు నెలలు ఆడుతుంది కాబట్టి వాళ్లు ఎప్పుడైనా చూడొచ్చు కదా అంటున్నాడు శంకర్. భార్య కోసం మొత్తం థియేటర్ ను బుక్ చేసిన శంకర్ ను అభినవ షాజహాన్ అంటున్నారు హామిర్ పూర్ వాసులు.