సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి
అంతా సవ్యంగా ఉంది. అన్ని కార్యక్రమాలూ చక్కగా సాగుతున్నాయి. ప్రజలు ఆదరిస్తున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు. అందర్నీ అలరిస్తూ పాలిస్తున్నారు. ఆఖరుకు జిల్లాల విభజన కూడా కొద్దిపాటి ఆందోళనలు మినహా సజావుగా సాగిపోయింది. మీరనుకున్న భగీరథ, తదితర పథకాలన్నీ కుదుపులేకుండా అమలవుతున్నాయి. ప్రతిపక్షం అనేదాన్ని లేకుండా చేసేశారు. ప్రతిపక్షాల నుంచి ఎమ్మల్యేలు వస్తామన్నా ఇంకా తీసుకునేలా ఉన్నారు. అహో కేసీఆర్.. ఓహో కేసీఆర్ అని తెలంగాణ కీర్తిస్తోందంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున జేజేలు పలుకుతూ, హారతులిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకు అలజడి రేగింది. అనుమానం ఎందుకు రేకెత్తింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటూ ఎందుకు సర్వే చేయించుకున్నారు. 119సీట్లలో 110 మావేనని ఎందుకు చెప్పించుకుంటున్నారు.
కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారు వచ్చి రెండున్నరేళ్ళయ్యింది. ఏదైనా పథకం అమలు ఎంత సమర్థంగా అవుతోందన్న అంశం నిర్థారించడానికి ఈ సమయం అరకొరే. పథకాలు పూర్తయ్యి ఫలాలు ప్రజలకు చేరిన తరవాత వాటి గురించి సర్వే చేయించుకోవాలి. అవునంటారా. కాదంటారా. ఈ సర్వే వెనక ప్రతిపక్షాల మనోధైర్యాన్ని మరింత దెబ్బ తీసే ఆలోచన కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసుతో డీలా పడిపోయి చేతులెత్తేసిన టీటీడీపీని మరింత పాతరేసేందుకూ ఉద్దేశించినట్టుంది. ఈ సర్వేలో పాపం ఆ పార్టీకి ఒక్క సీటూ దక్కకపోవడం దేనికి సంకేతం. తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ను విలీనం చేసేస్తానన్న పార్టీ కాంగ్రెస్కు మరీ రెండు సీట్లే వస్తాయట. ఇలాగే, ఈ సర్వేలో అతిశయోక్తులు చాలా కనిపిస్తున్నాయి. రెండున్నరేళ్ళ తరవాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం. ప్రతిపక్షాల బలం పెరగచ్చు లేదా.. 119 స్థానాలూ అధికార పక్షం ఖాతాలోనే పడొచ్చు. బీజేపీ చర్యల కారణంగా రాజీనామా ఇచ్చేసి, 2015లో ఎన్నికలకు వెళ్ళిన కేజ్రీవాల్ పార్టీ ఆప్ ఉన్న 70 స్థానాల్లో 67 గెలుచుకుంది. అంటే తన పట్ల కుట్ర జరుగుతోందని ప్రజలకు నమ్మకం కలిగించింది. ఆ నమ్మకంతోనే ఎన్నికలకు వెళ్లి సానుభూతి పవనాలతో కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీని తన చీపురు గుర్తుతో తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం టిఆర్ఎస్ సర్కారుకు కేంద్రం నుంచి ఎటువంటి వత్తిడీ లేదు. వారు కోరుకున్నట్లు కవితకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వకపోవడం తప్ప. మిగిలినవన్నీ అడక్కుండానే ఇస్తున్నారు. అంతా సవ్యంగా ఉన్న ఈ తరుణంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటూ సర్వే నిర్వహించుకోవడం తమకున్న టీఆర్ఎస్ తన వాపును పెంచుకుని చూపించుకోవడం తప్ప వేరొకటి కాదు.