టాలీవుడ్లో ఎప్పుడూ ఓ ట్రెండ్ అలా అలా తిరుగుతూ ఉంటుంది. ఫ్యాక్షన్ కథలు హిట్టయితే అవే వరుస కడతాయి. లవ్ స్టోరీలు ఆడితే అవే వండేస్తారు. నిశ్చితార్థం అయిపోయిన అమ్మాయిని, హీరో లవ్‌లో దింపడం అనే కాన్సెప్టు హిట్టయితే ఇక అలాంటి కథలే వస్తాయి. ఇప్పుడు కూడా ఓ ట్రెండ్ నడుస్తోంది. అదే… ‘బైకు’ కథలు.
‘ఆర్.ఎక్స్ 100’ పేరుతో ఓ సినిమా వస్తున్నప్పుడు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సినిమా విడుదలై సూపర్ హిట్ కొట్టేసింది. ఆర్.ఎక్స్ 100కీ ఆ కథకీ అస్సలు సంబంధమే లేదు. కానీ ప్రేక్షకులు అవేం పట్టించుకోలేదు. అల్లు అర్జున్ చేస్తున్న ‘ఐకాన్’ కథ మాత్రం బైక్ చుట్టూనే నడుస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఇలాంటి కథే ఎంచుకున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థలో `హీరో` అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ‘హీరో’ అంటే ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటారేమో. ‘హీరో’ అనే బైకు చుట్టూ ఈ కథ నడుస్తుందని తెలుస్తుంది.
శ్రీహరి తనయుడు మేఘాంష్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. తను కథానాయకుడిగా ‘రాజ్‌దూత్’ అనే సినిమా తెరకెక్కుతోంది. రాజ్ దూత్ అనేది 1990ల నాటి బైకు. దాని చుట్టూ ఈ కథ నడుస్తుంది కాబట్టి ఈ పేరు పెట్టారని సమాచారం. మొత్తానికి మన హీరోలు సినిమాల్లో బైకు మీద రయ్ రయ్ అంటూ దూసుకుపోవడమే కాదు, బైకుల పేర్లని టైటిళ్లుగా మార్చేసి, వాటి చుట్టూ కథలు అల్లేసి, యువతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి పెద్ద ప్లానే వేస్తున్నారన్నమాట. మరి ఈ ట్రెండ్ ఎంత కాలమో చూడాలి.