హైదరాబాద్: దసరా రోజున జరుగనున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి లక్ష-లక్షన్నరమంది దాకా ప్రజలు హాజరవుతారని అంచనా ఉంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం మధ్యాహ్నం మూడున్నర వరకు జరుగుతుంది. వచ్చిన ప్రజలను ఆకలితో పంపకూడదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ప్రభుత్వం వీరందరికీ కడుపునిండా భోజనం పెట్టాలని నిశ్చయించింది. అయితే ఇంత భారీస్థాయిలో వచ్చే జనానికి బంతిలాగా గానీ, బఫేలాగా గానీ భోజనం ఏర్పాట్లు చేయటం కష్టం కనుక లంచ్ ప్యాకెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లంచ్ ప్యాక్‌లో ఉంచే పదార్థాల వివరాలు ఇవాళ బయటకొచ్చాయి. పులిహోర, చక్కెరపొంగలి, దద్ధోజనం, తాపేశ్వరం కాజా, అరటిపండు ఉంటాయని అధికారులు చెప్పారు. ప్రముఖులకు ముఖ్య అతిథులకుమాత్రం విడిగా మెనూ ఉంటుంది. భోజన ఏర్పాట్లను మహిళా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణంలోకి ప్రవేశించేటపుడే ఈ లంచ్ ప్యాకెట్‌ను, 3 వాటర్ ప్యాకెట్లను ఒక కవర్లో పెట్టి సభికులకు ఇచ్చేస్తారు.
ఇక అతిథులకోసం ఇస్తున్న విందులో పూర్ణం బూరెలు, బొబ్బట్లు, చక్రపొంగలి, గుంటూరు గోంగూర, కృష్ణాజిల్లా ఉలవచారు, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, నెల్లూరు గారె, ఆవకాయ, ఆంధ్రాకే ప్రత్యేకమైన శాకాహార కూరలు, పుల్కాలు అందిస్తున్నారు. ఈ ఏర్పాట్లను కేఎంకే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ చూస్తోంది. ఎవరికి ఏవి కావాలంటే అవి తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.