లావా ఇంటర్నేషనల్ సంస్థ రూ.500కోట్ల పెట్టుబడితో తిరుపతిలో మొబైల్ ఫోన్లు తయారీ సంస్థను ఏర్పాటు చేయబోతోంది. దాని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతి సమీపంలో లావా సంస్థకు 20 ఎకరాల స్థలం కేటాయించింది. అక్కడే మరో సుప్రసిద్ధ మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు మైక్రోమాక్స్ మరియు సెల్ కాన్ కూడా తమ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నాయి. డిల్లీ సమీపంలో గల నొయిడాలో లావా సంస్థ ప్రధాన ఉత్పత్తి కేంద్రం ఉంది. దక్షిణాదిన మరొకటి స్థాపించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తే చాలా సానుకూల స్పందన రావడంతో తిరుపతిలో తమ ఉత్పత్తి సంస్థ ఏర్పాటుకి లావా సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ సంస్థ ద్వారా సుమారు 15, 000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. తిరుపతిలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ తో బాటు, మొబైల్ ఫోన్లకు సంబంధించి హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ అభివృద్ధి కోసం ఒక పరిశోధనశాలను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఈ సంస్థకు బెంగళూరులో పరిశోధనశాల ఉంది.