రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రాజ్ తరుణ్ అంతకంతకూ కూరుకుపోతున్నాడే తప్ప, పైకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా లావణ్య రాజ్ తరుణ్‌కు మరో షాక్ ఇచ్చింది. రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేనని, ఆత్మహత్యే శరణ్యమంటూ ఓ లేఖ రాసింది. అది కాస్త… తన తరపున ఈ కేసు వాదిస్తున్న కల్యాణ్ దిలీప్ సుంకరకు పంపింది. వెంటనే ఆయన అలెర్ట్ అవ్వడం, లావణ్య ఫ్లాట్ కు పోలీసులు వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడంతో – కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. లావణ్య ఇలాంటి పరిస్థితుల్లో ఏ పిచ్చి నిర్ణయం తీసుకొన్నా, అది రాజ్ తరుణ్‌పై ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంది. ఓరకంగా రాజ్ తరుణ్ పై ఇది లావణ్య ప్రయోగించిన బెదిరింపు బాణమే అనిపిస్తోంది.
రాజ్ తరుణ్ చాలా రోజుల నుంచి సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ లావణ్య ససేమీరా అంటోంది. ‘నాకు రాజ్ తరుణ్ కావాల్సిందే’ అని పట్టుబడుతోంది. తన పేరు మీద ఉన్న విల్లాతో పాటు, కొంత నగదు ఇస్తానని రాజ్ తరుణ్ సంప్రదింపులు మొదలెట్టాడు. కానీ లావణ్య మాత్రం తనకు డబ్బుతో పని లేదంటోంది. రాజ్‌తరుణ్‌తో తనకు పెళ్లయ్యిందని నిరూపించే సాక్ష్యాలు లావణ్య దగ్గర బలంగా ఉన్నాయి. దాదాపు 170 పైచిలుకు సాక్ష్యాల్ని పోలీసుల ముందు ఉంచింది. ఇవే ఈ కేసులో కీలకం కానున్నాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ ముందున్నవి రెండే రెండు మార్గాలు. ఒకటి.. లావణ్యతో కలిసి కాపురం చేయడం, లేదంటే ఈ వ్యవహారం కోర్టులో తేల్చుకోవడం. దీనిపైనే రాజ్ తరుణ్ తర్జనభర్జనలు పడుతున్నాడని టాక్.