వరుణ్ తేజ్‌ని పెళ్లాడి, మెగా ఇంటి కోడలు అయిపోయింది లావణ్య త్రిపాఠీ. పెళ్లయ్యాక లావణ్య సినిమాల్లో నటిస్తుందా, లేదా? అనే చర్చ కాస్త గట్టిగానే సాగింది. దీనికి సమాధానం దొరికేసింది. తాను సినిమాలకు దూరం కానని, వ్యక్తిగత జీవితంతో పాటు తనకు వృత్తిగత జీవితం కూడా ముఖ్యమే అని అంటోంది. లావణ్య నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ ఈరోజే ఓటీటీలోకి వచ్చింది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠీ తన కెరీర్ గురించి మీడియాతో ముచ్చటించింది.
వరుణ్ తనకు చాలా సపోర్టీవ్‌గా ఉన్నాడని, మెగా ఇంట్లోనూ తనకు కావల్సిన స్వేచ్ఛ దొరుకుతోందని, కెరీర్ విషయంలో ఎవరూ ఇబ్బంది పెట్టడం లేదని లావణ్య క్లారిటీ ఇచ్చింది. ”వరుణ్ నా కెరీర్ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. పూర్తిగా నా ఇష్టానికే వదిలేశాడు. నాకే అప్పుడప్పుడూ నేను విన్న కథలు తనతో పంచుకోవాలని అనిపిస్తోంది. నన్ను అర్థం చేసుకోనే ఓ కుటుంబం దొరికింది. ఇలా చేయ్, అలా చేయ్ అని ఎవరూ సలహాలు ఇవ్వడం లేదు. ఇంత మంచి ఫ్యామిలీలో అడుగు పెట్టడం చాలా ఆనందాన్ని ఇస్తోంది” అని చెప్పుకొచ్చింది లావణ్య. లావణ్య చేతిలో మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయిప్పుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కించిన ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొంది. దాంతో పాటు ఓ తమిళ సినిమాలోనూ నటిస్తోంది.