అందాల రాక్షసిగా అలరించింది లావణ్య త్రిపాఠి. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలతో వరుస విజయాల్ని అందుకొంది. టాలీవుడ్లో బిజీ బిజీగా గడిపేస్తున్న కథానాయికల్లో తనకీ ఓ చోటు సంపాదించుకొంది. ఇటీవల `మిస్టర్`తో పలకరించిన లావణ్య.. ఇప్పుడు `రాధ`తో మరోసారి సందడి చేయబోతోంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠితో తెలుగు 360 డాట్ కామ్ చిట్ చాట్..
* హాయ్ లావణ్య
– హాయ్
* ఈ సినిమాలో రాధ ఎవరు?
– నా పేరు రాధ… శర్వా పేరు కూడా రాధనే. నేను రాధలా అమాయకంగా.. ఉంటా. శర్వామాత్రం శ్రీకృష్ణుడి టైపు. ఇద్దరి పాత్రలూ కలసి వచ్చేలా ‘రాధ’ అనే పేరు పెట్టారు.
* మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
– నాదేదో కొత్త పాత్ర.. ఇది వరకు చేయని పాత్ర అని చెప్పను. చాలా సహజంగా ఉంటుంది. కాలేజీ అమ్మాయిని. ఇంట్లో చాలా పద్దతిగా ఉంటా. ఇంట్లోంచి కాలు బయటపెడితే అల్లరే అల్లరి.
* నిజ జీవితంలోనూ మీరు ఈ టైపేనా?
– (నవ్వుతూ) అక్షరాలా. బయట ఎలా ఉన్నా.. ఇంటికెళ్లేసరికి పద్ధతి వచ్చేస్తుంది. అమ్మానాన్నలంటే నాకు చాలా గౌరవం. వాళ్ల దగ్గర వినయంగానే ఉంటా. ఇంట్లో లావణ్యకూ.. బయట ఉండే లావణ్యకూ చాలా తేడా ఉంది.
* మీ సినిమాల గురించి వాళ్లు పట్టించుకొంటారా?
– వాళ్లు సినిమాలు చూసేదే తక్కువ. పైగా తెలుగు భాష అస్సలు అర్థం కాదు. సోగ్గాడే చిన్ని నాయన తప్ప మరే సినిమా చూళ్లేదు. అలాంటప్పుడు సలహాలూ, సూచనలూ ఏం ఇస్తారు?
* శర్వానంద్‌తో తొలిసారి పనిచేశారు… శర్వా సెట్లో ఎలా ఉండేవాడు?
– శర్వా చాలా కామ్. పెద్దగా మాట్లాడేవాడే కాదు. నేనే కలగచేసుకొని మాట్లాడేదాన్ని. శర్వాలో ఇద్దరుంటారు. ఆన్ స్క్రీన్ ఒకరు.. ఆఫ్ స్ర్కీన్ ఒకరు. బయట ఎంత బుద్దిగా ఉంటాడో.. తెరపై అంతలా చెలరేగిపోతాడు. శర్వాలో ఇంత మార్పు ఊహించలేదు.
* మీ గత సినిమా `మిస్టర్` ఫ్లాప్ అయ్యింది. ఆ రిజల్ట్ బాధించిందా?
– కొంచెం కూడా లేదు. ఎందుకంటే నేను చాలా ఇష్టపడి చేసిన పాత్ర అది. చేస్తున్నప్పుడే దాన్ని బాగా ఆస్వాదించా. సినిమా చూస్తున్నప్పుడూ నా పాత్రలో లోపాలేం కనిపించలేదు. నా వరకూ నేను కరెక్ట్‌గా చేశా. అలాంటప్పుడు బాధ పడడం ఎందుకు?
* సినిమా రిజల్ట్ తప్పకుండా కెరీర్‌పై ప్రభావం చూపిస్తుందేమో?
– కావొచ్చు. కానీ నాకు మాత్రం ఫ్లాపుల ఎఫెక్ట్ మీద పడదనే అనుకొంటున్నా. అందాల రాక్షసి అంతంత మాత్రంగానే ఆడింది. అయితే నన్నంతా గుర్తు పట్టారు కదా? తరువాత అవకాశాలు ఇచ్చారు కదా? ఈ విషయంలో నేను చాలా లక్కీ.
* జయాపజయాలు మీపై ప్రభావం చూపించవు అంటారు..
– అవును. నేను పెద్ద పెద్ద విజయాలకూ పొంగిపోను. `సినిమా హిట్టయ్యిందా.. సరే` అంటానంతే. `నువ్వేంటి ఇంత సింపుల్‌గా ఉంటావ్` అని నా స్నేహితులంతా ఆశ్చర్యపోతారు. నా సినిమా విడుదల అవుతోందంటే.. ముందు రోజు నుంచే నా సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకొంటా. మనసుని వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా. నాలుగు రోజులు గడిచాక.. హిట్, ఫ్లాప్ అనే విషయాల్ని మైండ్లోంచి తీసేస్తా.
* మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి?
– కాన్ఫిడెన్ట్‌గా ఉండడం. నిజాయతీగా ఉన్నప్పుడే మనపై మనకు నమ్మకం ఏర్పడుతుంది. అది మన ఫేస్‌లో తప్పకుండా కనిపిస్తుంది.
* నాగార్జునతో నటించారు.. ఇప్పుడు నాగచైతన్యతో చేయబోతున్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరితోనూ హీరోయిన్గా నటించడం ఇబ్బందిగా అనిపించడం లేదా?
– కొంచెం కూడా అనిపించడం లేదు. ఎందుకంటే… తండ్రీ కొడుకులిద్దరితోనూ నటించిన కథానాయికలు చాలామంది ఉన్నారు. ప్రేక్షకులు వాటిని పెద్దగా పట్టించుకోరు. దాంతో పాటు సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున గారి పాత్ర, నా పాత్ర చాలా సహజంగా తీర్చిదిద్దారు. ఆ సినిమాలో పాత్రలు తప్ప మేం కనిపించం. నాగార్జున సార్ కంటే ముందు నేను చైతూతో నటించా. ‘మనం’లో చిన్న కామియో చేశా. కాబట్టి ముందు నేను చైతూతోనే నటించినట్టు.
* సమ్మర్ ప్లాన్స్ ఏంటి?
– ఏమీ లేవు. షూటింగ్ తప్ప.. మరో వ్యాపకం పెట్టుకోలేదు. సమ్మర్లో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేద్దామన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నాకు వర్క్‌లోనే ఎక్కువ ఎంజాయ్మెంట్ కనిపిస్తోంది.