లావణ్య త్రిపాఠీ ఇప్పుడు మెగా కోడలు. వరుణ్‌తేజ్‌ని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఎప్పుడైతే పెళ్లి చేసుకొందో, అప్పుడే లావణ్య ఇక సినిమాలు చేయదేమో అనుకొన్నారంతా. అయితే ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తూ లావణ్య కొత్త ప్రాజెక్ట్ మొదలెట్టింది. అదే.. ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. నాగమోహన్ బాబు, రాజేష్ నిర్మాతలు. ఈరోజు లావణ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన బయటకు వదిలారు నిర్మాతలు.
నానితో ‘భీమిలి కబడ్డీ జట్టు’, సుధీర్ బాబుతో ‘ఎస్.ఎం.ఎస్’ చిత్రాలకు దర్శకత్వం వహించారు సత్య. ఆ తరవాత ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇన్నాళ్లకు ‘సతీలాలావతి’ స్క్రిప్టుతో మళ్లీ మెగాఫోన్ పడుతున్నారు. మిక్కీ జే.మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది. ఇది రెగ్యులర్ కథ కాదని, భిన్నమైన అంశాన్ని సృశిస్తూ సాగే చిత్రమని నిర్మాతలు చెబుతున్నారు. లావణ్య కూడా చాలా కథల్ని విని, వాటిని ఒడబోసి, ఫైనల్ గా ఈ కథని ఎంచుకొంది. పెళ్లయ్యాక చేస్తున్న సినిమా కాబట్టి, మెగా అభిమానులు ఫోకస్ ఈ సినిమాపై ఉంటుందని తనకు తెలుసు. అందుకే స్క్రిప్టుపరంగా, తన క్యారెక్టరైజేషన్ పరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకొంద లావణ్య. ఈ కొత్త ఇన్నింగ్స్ లో లావణ్య త్రిపాఠీ కొణిదెల నుంచి ఎలాంటి సినిమాలొస్తాయో చూడాలి.